హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తేతెలంగాణ): భారత రాజకీయాల్లో ఎన్నో మార్పులు సంభవించాయని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా వామపక్ష పార్టీల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఆయన డల్లాస్లో ప్రవాస భారతీయులతో ‘మీట్ అండ్ గ్రీట్’లో పాల్గొన్నారు.
వామపక్ష పార్టీలు తమ పోరాటాలతో పేద ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలను మాత్రం ఆశించిన స్థాయిలో ఆకర్షించలేకపోయామని తెలిపారు. భారత్లో సామాన్య ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నాయని విమర్శించారు. రానున్న రోజుల్లో వామపక్షాలు బలమైన శక్తిగా ఎదుగాల్సిన అవసరం ఉన్నదని నారాయణ అభిప్రాయపడ్డారు.