హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో శుక్రవారం నుంచి 18 వరకు సీపీఐ 24వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్టు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాసభలకు దాదాపు 26 దేశాల నుంచి కమ్యూనిస్టు నాయకులు సౌహార్ద్ర ప్రతినిధులుగా హాజరవుతున్నారని చెప్పారు. గత మహాసభ కేరళలో కొల్లాం వేదికగా నిర్వహించామని, అక్కడి నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ వివిధ ప్రాంతాల్లో ప్రయాణించి విజయవాడకు శుక్రవారం చేరుకుంటుందని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో కమ్యూనిస్టు శ్రేణులు, జన సేవాదళ్ కార్యకర్తలు బహిరంగసభలో పాల్గొంటారని వివరించారు. వరంగల్ నుంచి ప్రత్యేక రైల్ ఏర్పాటుచేశామని తెలిపారు.