పెద్దఅంబర్‌పేట : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందాల పోటీలో ( Beauty Pageants ) బిజీగా ఉన్నాడని సీపీఐ( CPI ) జాతీయ కార్యదర్శి నారాయణ( Narayana ) ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు సమీపంలోని రావినారాయణరెడ్డి కాలనీలో గతనెల కాలిపోయిన గుడిసెలను ఎమ్మెల్సీ సత్యం( MLC Satyam) , సీపీఐ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం విజయవాడకు చెందిన పాపులర్ షూ మార్ట్, పలువురి సహకారంతో బాధితులకు బ్లాంకెట్లు, టవళ్లు, బకెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ సీఎం అందాల పోటీల్లో బిజీగా ఉన్నాడు. బాగా డబ్బులు ఉండి, సగం డ్రెస్సులు వేసుకుని అందాల పోటీలకు వస్తుంటారు. మనం డబ్బులు లేకపోయినా నిండుగా బట్టలు వేసుకుంటాం. అందాల పోటీల నుంచి ఇటు చూసి పేదోళ్లు అనుభవిస్తున్న బాధలు కూడా చూడండని సీఎంకు సూచించారు. అందాల పోటీలకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటిలో 10శాతం ఖర్చుపెడితే గుడిసెలు వచ్చేస్తాయని పేర్కొన్నారు.
అందాల పోటీల్లో పాల్గొనేటోళ్లు అందాలు చూపించి వెళ్లిపోతరు. వాళ్లకు ఓట్లు ఉండవు. కానీ, ఇక్కడి పేదోళ్లకు ఓట్లు ఉంటయి. ఓటేసేటోళ్లను చూడయ్య అంటూ హితవు పలికారు. అయినోనికి ఆకుల్లో, కానోనికి కంచాల్లో పెడతామంటారు. అలా పెట్టడం సరికాదని సూచించారు. అందాల పోటీలు ప్రారంభమయ్యేలోపు గుడిసెలతోపాటు సర్వం కోల్పోయిన నిరుపేదలకు దుస్తులు, ఇతర వస్తువులు సాయం చేయాలని డిమాండ్ చేశారు. కష్టనష్టాలకు ఓర్చి గుడిసెల్లోనే జీవిస్తున్న నిరుపేదలకు సీపీఐ అండగా ఉంటుందన్నారు.
రావినారాయణరెడ్డి కాలనీలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలందరికీ పక్కాగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్సీ సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలిపోయిన గుడిసెల్లో ఎంతోమంది పేద విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా బూడిదయ్యాయని, వారిని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆందోజ్ రవీంద్రాచారి, పాలమాకుల జంగయ్య, ముత్యాల యాదిరెడ్డి, పానుగంటి పర్వతాలు, పబ్బతి లక్ష్మణ్, అజ్మీర్ హరిసింగ్‌నాయక్, నర్సింహ, యాదగిరి, నవనీత, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.