హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): బ్యాంకులను మోసం చేసిన మాఫియా గ్యాంగ్‌కు సపోర్ట్ చేస్తున్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకులను మోసం చేసి కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకుంటున్న కార్పొరేట్ కంపెనీలకు బీజేపీ అగ్రనేతలు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.
జీ20 సదస్సు 420 చేతిలో పడిందని విమర్శించారు. మోదీనే పెద్ద 420 అన్నారు. జీ20 లోగోను బీజేపీ ఎన్నికల గుర్తుగా మార్చి ప్రచారం చేసే దుస్థితి రాబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని విమర్శించే నేతలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఈడీ, సీబీఐలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నదని విమర్శించారు.