హైదరాబాద్, జూన్ 25 (నమస్తేతెలంగాణ): ‘జాతీయ స్థాయిలో జనగణన, బీసీ కులగణనను 2025లోనే పూర్తిచేయాలి.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు 2028 దాకా సాగతీయొద్దు’ అని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల ఉద్యమాలకు తలొగ్గిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం జనగణన, బీసీ కులగణనకు ముందుకొచ్చిందని చెప్పారు.
వీటిపై కాలయాపన చేయకుండా వెంటనే ప్రక్రియను చేపట్టాలని కోరారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సత్యం మాట్లాడారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు. జూలై 14న అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా ప్రధానికి కుల, జనగణనపై దరఖాస్తులు ఇవ్వాలని, జూలై చివరివారంలో సమితి జిల్లా మహాసభలు, ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్టు సమితి ప్రధాన కార్యదర్శి ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు వివరించారు.
సమావేశంలో సమితి డిప్యూటీ జనరల్ సెక్రటరీ నేదునూరి రాజమౌళి, ఆఫీసు బేరర్లు బొడ్డుపెల్లి కృష్ణ, చింతకింది కుమారస్వామి, బీ బాలయ్య, బత్తిని సదానందం, ప్రమీల, పల్నాటి యాదయ్య, రమేశ్, బాపు రాజు తదితరులు పాల్గొన్నారు.