హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): వ్యవస్థలోని లోపాలను దిద్దకుండా.. ఐబొమ్మ రవి, హిడ్మా లాంటి వారిని శిక్షించినంత మాత్రాన ప్రయోజనం ఉండదని సీపీఐ నేత డాక్టర్ కే నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక వీడియో విడుదల చేశాడు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న ఐబొమ్మ రవి, సినిమాలను పైరసీ చేయడం వెనుక వ్యవస్థలో లోపాలే కారణమని అభిప్రాయం వ్యక్తంచేశారు.
వ్యవస్థలో లోపాలను సరిచేయకపోతే ఐబొమ్మ రవి లాంటి వారు అనేకమంది పుట్టుకొస్తారని చెప్పారు. ఒక హిడ్మాను చంపితే, వెయ్యిమంది హిడ్మాలు తయ్యారవుతారని పేర్కొన్నారు. టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులిచ్చి సామాన్యులను దోచుకోవడానికి సహాయం చేస్తుందా? అని ప్రశ్నించారు. ఐబొమ్మ యాప్లో తాను కూడా ఫ్రీగా సినిమాలు చూశానని తెలిపారు. ఆరేడు వందలు పెట్టి సినిమాలు ఎలా చూడాలని.. అంత ఖర్చుపెట్టలేని వారికి ఐబొమ్మతో ఉచితంగా సినిమా చూసే అవకాశాలు దక్కుతున్నాయని నారాయణ పేర్కొన్నారు.