హైదరాబాద్ సిటీబ్యూరో/మలక్ పేట/ అచ్చంపేట, జూలై 15(నమస్తే తెలంగాణ): మలక్‌పేటలోని శాలివాహననగర్ పార్కు ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న వారితో సందడిగా ఉంది. ఒక్కసారిగా కాల్పుల శబ్దం అక్కడున్న వారిని భయాందోళనకు గురి చేసింది. క్షణాల్లోనే ఓ వ్యక్తి కండ్లలో కారం కొట్టి తుపాకులతో కాల్చి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నరసయ్యపల్లి తండాకు చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేతావత్ చందూ రాథోడ్(47) దిల్సుక్నగర్లోని ద్వారకాపూర్లోలో నివాసం ఉంటు న్నాడు. ఆయనకు భార్య నారీబాయి, కుమారుడు సిద్ధు, కూతురు సింధు ఉన్నారు.
మంగళవారం ఉదయం మలక్‌పేట డివిజన్లోని శాలివాహననగర్‌లోని పార్క్‌కు చందూనాయక్ తన భార్య, బిడ్డతో కలిసి వచ్చాడు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు ముందు గా ఆయన కండ్లలో కారం పొడి చల్లారు. ఇద్దరు ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో చందూరాథోడ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. దుండగులను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ తెలిపారు. ఘటనాస్థలాన్ని డీసీపీతోపాటు అడిషనల్ డీసీపీ శ్రీకాంత్, ఏసీపీలు సుబ్బరామిరెడ్డి, సోమవెంకటరెడ్డి, మలక్‌పేట ఇన్స్పెక్టర్ నరేశ్ పరిశీలించారు. దుండగులు ఉపయోగించిన కారును పోలీసులు చైతన్యపురి వద్ద స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఘటన అనంతరం రాజేశ్‌తో పాటు మరో ముగ్గురు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం.
బెదిరించినట్టే చంపేశారు: భార్య
తన భర్తను చంపేస్తానని జనగామ జిల్లాకు చెందిన సీపీఐ ఎంఎల్ పార్టీ నేత రాజన్న అలియాస్ రాజేశ్‌తోపాటు మరికొందరు బెదిరించినట్టు చందూరాథోడ్ భార్య నారీబాయి పోలీసుల ఫిర్యాదు చేశారు. ఓ భూమి విషయంలో వీరి మధ్య దూరం పెరిగిందని, రాజేశ్‌కు రెండేళ్లుగా దూరంగా ఉంటున్నట్టుగా తెలిపారు. కొన్ని రోజులుగా చందూ రాథోడ్‌ను హతమార్చేందుకు వీరు రెక్కీ నిర్వహిస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. తన భర్తను పలుమార్లు అప్రమత్తం చేశానని, ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేసేవారని పేర్కొన్నారు. వ్యక్తిగత కక్షలే చందూరాథోడ్ హత్యకు కారణమని , లోతుగా దర్యాప్తు జరుపుతామని డీసీపీ చైతన్యకుమార్ తెలిపారు. 2022లో జరిగిన ఎమ్మార్పీఎస్ నాయకుడి హత్య కేసులో చందు నిందితుడిగా ఉన్నాడని, ఎల్బీనగర్ పీఎస్‌లో అతడిపై కేసు ఉందని ఆయన తెలిపారు. ఇటీవల హయత్ నగర్ డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డినగర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసే విషయంలో చందూరాథోడ్కు, రాజేశ్, మున్నా, సుధాకర్‌తో గొడవ జరిగినట్టుగా తెలిపారు. ఈ క్రమంలోనే వివాదం మరింత పెరిగిందని చెప్పారు. దోషులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.