సిద్దిపేట అర్బన్, నవంబర్ 1: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం సీపీ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎంపీపై మిరుదొడ్డి మం డలం పెద్దచెప్యాలకు చెందిన గటాని రాజు (40) కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడని చెప్పారు. ఈ మేరకు దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు గటాని రాజు విలేకరి అని చెప్పుకుంటూ ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తూ జల్సాలు చేసే వాడ ని.. కానీ, అతనిపై ఎక్కడా కేసు నమోదు కాలేదని చెప్పారు.
ఎంపీని చంపాలనే ఉద్దేశంతోనే దుబ్బాక మార్కెట్లో కత్తి కొనుగోలు చేసి హత్యకు యత్నించాడని తెలిపారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే నిందితుడిని ప్రజలు కొట్టారని.. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని గాంధీ దవాఖానకు తరలించి చికిత్స చేయించామని చెప్పారు. దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన నిందితుడు రాజును తొగుట సీఐ కమలాకర్ బుధవారం అదుపులోకి తీసుకొని విచారించగా.. ‘సంచలనమైన సంఘటనకు పాల్పడటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించేందుకు హత్యాయత్నం చేశాను’ అని నేరాన్ని ఒప్పుకున్నట్టు సీపీ తెలిపారు. నిందితుడు నేరం చేయడానికి ఇతర కారణాలు ఉన్నాయా? ఎవరైనా ప్రోత్సహించారా.. అన్న అంశాలపై ప్రత్యేక బృందాల ద్వారా విచారణ కొనసాగుతున్నదని చెప్పారు. రాజును కోర్టులో హాజరుపరచగా, అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారని, అతడిని చర్లపల్లి జైలుకు తరలించామని తెలిపారు.