హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు, ముఖ్యంగా మహిళలకు భద్రత ఎంత అధ్వానంగా ఉన్నదో సాక్షాత్తు ఓ మహిళా పోలీస్ ఆఫీసరే రుజువు చేశారు! హైదరాబాద్ మహానగర పరిధిలో తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బీ సుమతికి స్వయంగా ఎదురైన అనుభవాలు శాంతిభద్రతల్లోని డొల్లతనానికి, కాంగ్రెస్ పాలనలో పోలీసు వ్యవస్థ పనితీరుకు అద్దంపడుతున్నాయి. ఒకప్పడు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరొందిన హైదరాబాద్ నగరంలో.. నేడు మహిళలు ఎంతటి విపత్కర, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో సీపీ సుమతి స్వయంగా రంగంలోకి దిగడంతో తేటతెల్లమైంది. ఆమె సుమారు రెండున్నర గంటల సేపు దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా తిరుగడంతో నగరంలో మహిళల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో, వారికి రక్షణ, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఎంతా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయో స్పష్టమైంది.
అసలేం జరిగింది?
ఇంటలిజెన్స్, ఎస్ఐబీ అధికారిగా పనిచేసిన బీ సుమతిని గత నెలలో ప్రభుత్వం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా నియమించింది. ఆమె ఈ నెల 1న బాధ్యతలు స్వీకరించారు. అదేరోజు అర్ధరాత్రి దాటిన తరువాత నగరంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటైన దిల్‌సుఖ్‌నగర్‌లో సివిల్ డ్రస్‌లో సాధారణ మహిళ మాదిరిగా వెళ్లి క్షేత్ర పరిశీలన చేశారు. కొద్దిసేపు బస్‌స్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్నట్టుగా నిలబడ్డారు. సమీపంలోని కోణార్క్ థియేటర్ లైన్, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనూ తిరిగారు.
నిద్రపోతున్న పెట్రోలింగ్
అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో ఆమె దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకున్నారు. స్థానిక పోలీసులు ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. తన కారును కూడా దూరంగా పార్కింగ్ చేశారు. అదే ప్రాంతంలో సుమారు రెండున్నర గంటల వరకు తిరిగారు. ఆమె రోడ్డుపై ఉన్నంత సేపు కొందరు యువకులు ఆమెను దూరం నుంచి చూస్తూ వెంబడించారు. రెండున్నర గంటలపాటు అంత కీలకమైన ప్రాంతంలో ఒక్క పెట్రోలింగ్ వాహనం కూడా కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. అక్కడి పోకిరీల చేష్టలతో విసిగిపోయిన ఆమె వెంటనే చైతన్యపురి, సరూర్‌నగర్ పోలీసులను అక్కడకు పిలిపించారు. పోలీసులు అక్కడకు చేరుకోవడం, ఆమెకు సెల్యూట్ చేయడంతో అప్పటివరకు ఆమె వైపు అదోరకంగా చూసిన పోకిరీలు షాక్ అయ్యారు. తాము అప్పటివరకు కామెంట్లు చేసింది ఒక పోలీస్ అధికారినా అంటూ పోకిరీలు భయపడ్డారు. సుమారు 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి ఆ తరువాత కౌన్సిలింగ్ నిర్వహించి వదిలేశారు. పట్టుబడ్డ వారిలో పలువురు విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉన్నారు. దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ప్రైవేట్ హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆమె దిల్‌సుఖ్‌నగర్‌లో తిరుగుతూ కొన్ని మహిళా హాస్టల్స్ వద్ద భద్రతను కూడా పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు.
అందరివి వంకర చూపులే!
ఒంటరిగా ఒక మహిళ అర్ధరాత్రి రోడ్లపై ఉన్నదంటే ఎందుకు ఉన్నది? ఆమె సమస్య ఏమిటి? అని తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు ఎవరూ లేరని, వంకర బుద్ధితో చూసే వాళ్లే ఎక్కువగా ఉన్నారని ఆమె సిబ్బందితో వాపోయినట్టు సమాచారం. అటు హైదరాబాద్, ఇటు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లకు సరిహద్దుగా ఉన్న దిల్సుఖ్నగర్ ప్రాంతంలో పెట్రోలింగ్, బ్లూకోల్ట్ వాహనాలు కనిపించకపోవడంతో ఆమె అశ్చర్యానికి గురయ్యారని సమాచారం. పెట్రోలింగ్ వ్యవస్థ నిద్రపోతున్నదా? ప్రధాన చౌరస్తాల్లోనే ఈ పరిస్థితి ఉంటే కాలనీలు, బస్తీల్లో పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం.
ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఒంటరిగా రోడ్లపై మహిళలు నడువలేని పరిస్థితి ఉన్నదని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నది. ఆ ఆరోపణలు నిజమని నిరూపితమైంది. సాక్షాత్తు మహిళా ఐపీఎస్ అధికారే స్వయంగా రంగంలోకి దిగి హైదరాబాద్ నగరంలో పోలీసింగ్ లోపాలు, క్షీణించిన శాంతిభద్రతలు, మహిళల భద్రతా లోపాలను ఎత్తిచూపారు. స్వయంగా మహిళా పోలీస్ కమిషనర్ ‘సిటీ సేఫ్ కాదు’ అని నిరూపించడం కాంగ్రెస్ పాలనలో పడిపోయిన భద్రతా ప్రమాణాలకు నిదర్శనం. హైదరాబాద్ నేర రాజధానిగా మారిపోతున్నదంటూ ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తంచేస్తున్న క్రమంలో మహిళా అధికారి ఆ విషయాన్ని అర్ధరాత్రి స్వయంగా రంగంలోకి దిగి నిర్వహించిన అపరేషన్‌తో రుజువైంది.
కమిషనర్ సాహసం… భయంకర నిజం!
అర్ధరాత్రి ఒంటరిగా దిల్సుఖ్నగర్ చౌరస్తా ప్రాంతంలో నిలబడ్డ సీపీ సుమతికి ఎన్నో చేదు అనుభవాలు.. మరెన్నో వినరాని మాటలు.. పోకిరీల వెకిలి చేష్టలు, వక్రబుద్ధుల వెకిలిచూపులు.. ఇవన్నీ ఎదురయ్యాయి! ఒంటరిగా నిలబడ్డ ఆమె వద్దకు.. బైక్‌ల మీద అటువైపుగా వెళ్తున్న యువకులు రావడం.. ఆపాదమస్తకం ఎగాదిగా చూడటం ఇదే వరుస! ‘రేటెంత? ఎక్కడకు వెళ్తున్నావు? వస్తావా?’ అంటూ పిచ్చిపిచ్చి కూతలు. ఆమె పక్కనే నిలబడి ఇష్టానుసారంగా కామెంట్లు! చిల్లర చేష్టలు! హైదరాబాద్ నగరంలో ఒక సాధారణ మహిళ అనునిత్యం భరిస్తున్న అన్నిరకాల బాధలను అంతటి సుమతి కూడా రెండున్నర గంటల పాటు ఓర్చుకోక తప్పలేదు. ఆమె ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కు వెళ్లారు. ఎక్కడ చూసినా అదే పరిస్థితి.. ఒంటరిగా నిలబడ్డ మహిళకు అవే కష్టాలు.. అవే బాధలు! నడస్తున్నప్పుడల్లా వెంబడిస్తూ అల్లరి చేయడం, నిల్చుంటే పక్కకు వచ్చి కారుకూతలు కూయడం.. ఎక్కడకు వెళ్లినా ఇదే తీరు. ఇన్ని బాధలను ఓర్చుకుంటూ నగరంలో మహిళల భద్రత ఎంత హీనంగా ఉన్నదో వెలుగులోకి తెచ్చారు.