రఘునాథపల్లి, నవంబర్ 24 : భూ సమస్యలతో ఓ మహిళను దాయాదులు ఇంట్లో బంధించిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. బాధితురాలి కథనం ప్రకారం.. కొమల్లకు చెందిన పేరబోయిన రాజుకు దాయాదులైన పేరబోయిన కొమురయ్యతో భూమి విషయంలో గొడవలు ఉన్నాయి. ఆదివారం రాజు వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లగా, అతడి భార్య భాగ్యలక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటున్నది. ఇదే అదును భావించిన కొమురయ్య మరో ఐదుగురితో వచ్చి ఆమె ఇంట్లోఉండగానే ఇరువైపులా ఉన్న తలుపులకు తాళాలు వేసి వెళ్లిపోయాడు. ఆందోళన చెందిన భాగ్యలక్ష్మి పోలీసులకు ఫోన్ చేయగా, వారు వచ్చి తలుపులు తీయించారు. కొమురయ్యతోపాటు ఆయనతో వచ్చిన ఐదుగురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.