Pinki Murder Case | నాంపల్లి కోర్టులు, జనవరి 5 (నమస్తే తెలంగాణ): గర్భిణి పింకీ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో నిందితులు మమత ఝా, వికాస్ కశ్యప్, అమర్‌కాంత్ ఝా, అనిల్ ఝాకు జీవిత ఖైదు విధిస్తున్నట్టు కూకట్‌పల్లిలోని 6వ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జీ పావని ప్రకటించారు. తుదిశ్వాస విడిచే వరకు ఆ నలుగురినీ జైలులోనే ఉంచాలని శుక్రవారం వెలువరించిన తీర్పులో స్పష్టం చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు స్వల్ప వ్యవధిలోనే ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీలు, ద్విచక్రవాహనం నంబర్ ఆధారంగా కేవలం 13 రోజుల్లోనే నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. వారు నివసించే గదిలో రక్తపుమరకలతో కూడిన ఎలక్ట్రిక్ కటింగ్ మెషీన్‌ను సీజ్ చేసి, డీఎన్ఏ రిపోర్టులు సేకరించారు. డీసీపీ ఎం గంగాధర్ నేతృత్వంలో దర్యాప్తు పూర్తి చేశారు. అనంతరం ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. గత ఆరేండ్లలో ఎంతో మంది సాక్షులను ప్రశ్నించింది. 65 మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా నిందితులకు శిక్షను ఖరారు చేసింది.
హత్య ఎలా జరిగిందంటే..
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉపేందర్ కథనం ప్రకారం.. పింకీని వదిలించుకోవాలన్న ఆలోచనతో భర్త వికాస్ తరచూ ఆమెతో గొడవకు దిగేవాడు. ఓసారి ఆమెను బలవంతంగా రైలులో తీసుకెళ్లి నాగ్‌పూర్ రైల్వేస్టేషన్లో వదలి వచ్చాడు. అనంతరం ఆమె మళ్లీ వికాస్ ఉండే చోటుకు తిరిగి రావడంతో గర్భం ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరగడంతో పింకీని కడతేర్చాలని వికాస్ నిశ్చయించుకున్నాడు. అందుకోసం తనతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మమతతోపాటు అమర్‌కాంత్ ఝా, అనిల్ ఝా సాయం తీసుకున్నాడు. ఆ నలుగురు కలిసి పింకీని హత్యచేసి మృతదేహాన్ని తమ గదిలోనే దాచిపెట్టారు. ఆ తర్వాత కట్టెలను కోసే ఎలక్ట్రిక్ కటింగ్ మెషీన్‌తో పింకీ మృతదేహాన్ని ముక్కలుగా కోసి రెండు గోనె సంచుల్లో కట్టిన నిందితులు.. ఆ సంచులను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ వద్ద పడేశారు.