హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. బుధవారం ఆయన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, రిటర్నింగ్ అధికారి ప్రియాంక, ఏఆర్వో పంకజ, ఎస్సీ అశోక్‌రెడ్డి తదితరులతో కలిసి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించారు.
ఈ కేంద్రంలోని రెండు గదుల్లో ఓట్ల లెక్కింపునకు మొత్తం 28 టేబుళ్లను ఏర్పాటు చేసినట్టు ఆర్వో ప్రియాంక తెలిపారు. ఒక్కో గదిలో ముగ్గురు ఏఆర్వోలను, రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద అదనంగా మరో ముగ్గురు ఏఆర్వోలను నియమించినట్టు చెప్పారు. కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్లు, అబ్జర్వర్లు ఉదయం 6.30లోగా.. ఏజెంట్లు ఉదయం 7 గంటల్లోగా కేంద్రంలో ఉండాలని స్పష్టం చేశారు. కౌంటింగ్‌లో ఏ అభ్యర్థికీ తొలి ప్రాధాన్య ఓట్లలో 50 శాతానికిపైగా రాకపోతే సెకండ్ ప్రయార్టీ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటిస్తామని తెలిపారు.