హైదరాబాద్ : నల్గొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ శాసన మండలిలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో చిట్‌చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అంశం ఆయన పరిధిలోనే ఉందని, రాజీనామా అంశాన్ని సాగదీసే అవకాశం కనిపిస్తుందన్నారు. కోమటిరెడ్డి అన్నదమ్ములకు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని, ఉపఎన్నికకు కారణం అయిన ఇద్దరు మునుగుతారన్నారు. రాజగోపాల్ రాజీనామా చేయాలని ఎవరు కోరారు? పార్టీ మారమని ఎవరు కోరారు? అని ప్రశ్నించారు. ఆయనకు ఎందుకు అసంతృప్తి ఉందో ఆయనే చెప్పారన్నారు.
డీ లిమిటేషన్ విభజన చట్టంలోనే ఉందని మండలి చైర్మన్ అన్నారు. కేంద్రం కావాలని చేయడం లేదని అనిపిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు మాటవిని బీజేపీ పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిందని, తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండా ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలిపారన్నారు. పోలవరంతో సమస్య తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు కూడా ఉందన్నారు. పోలవరం ప్రధాన అంశం ముంపు తగ్గించే ప్రయత్నం చేయాలని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోక తప్పదన్నారు. పోలవరం అంటే హైదరాబాద్‌లో కలుస్తాం అంటున్న వారు.. 1956కు ముందు చరిత్ర తెలుసుకోవాలన్నారు.
అప్పుడు ఏపీ ప్రజలు మద్రాస్‌లో ఉన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. గట్టుప్పల్ మండల ఏర్పాటు అంశం ఇప్పుడు కొత్తేం కాదన్నారు. రాజకీయాలకు మండల ఏర్పాటుకు సంబంధం ఎలా ఉంటుందన్నారు. ప్రకృతి ప్రకోపించినప్పుడు అమెరికానే మునిగిందని మండలి చైర్మన్ అన్నారు. కాళేశ్వరం కూడా ప్రకృతి వైఫరీత్యమే నన్నారు. నిరంకుశ పాలన, నియంత పాలన వైపు బీజేపీ కుట్రలు చేస్తోందని, ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి చేయని వ్యక్తి.. రాజీనామా చేసి ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. ఎంపీగా ఓడిపోయారు? ఎంపీగా గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఓడిపోయారన్నారు.
తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని మండలని చైర్మన్ అన్నారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నారని స్పష్టం చేశారు. ఎవరిని ఎవరిని సస్పెండ్ చేసినా అంతిమ తీర్పు ప్రజలదేనన్నారు. నేను ఎప్పుడూ అసంతృప్తిలో లేదన్నారు. జమ్మూకాశ్మీర్‌లో సీట్లు పెంచడం ఏంటి? తెలంగాణ, ఏపీ పెంచకపోవడమేంటని ప్రశ్నించారు. మనం రాజ్యాంగ పదవిలో ఉన్నామని, ఆ అధికారంలో ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలన్నారు. పాలపై జీఎస్టీ వేయడంతో విజయలాంటి డెయిరీలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుందన్నారు. ఉచిత పథకాలు వద్దు అనేది 8ఏళ్ల తర్వాత గుర్తుకు వచ్చిందా ప్రధానికి అని ప్రశ్నించారు. వితంతు పెన్షన్, వృధ్యాప్య పెన్షన్స్ ఉచిత పథకం అంటే ఎలా? అలాంటివి ప్రజలకు సహాయపడే పథకాలన్నారు.
షర్మిల కోరుకుంటున్న రాజన్న రాజ్యం కావాలంటే ఏపీలో కావాలన్నారు. రాజన్న రాజ్యం అంటే తెలంగాణ లేదు కదా? ఏపీలో మాత్రం రాజన్న రాజ్యం అవసరం.. తెలంగాణకు కాదన్నారు. తెలంగాణ ఏర్పాటు వద్దు అన్న వైఎస్సార్.. వీసాలు తీసుకోవాలి అన్న మాటలు మర్చిపోలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర వైఎస్సార్ చేశారని, దేశంలో సరైన ప్రత్యామ్నాయం లేకనే బీజేపీ ఆటలు సాగుతున్నాయన్నారు. సరైన నాయకత్వం అవసరమన్నారు. గవర్నర్ తన పరిధిలోనే ఉండాలని, పొలిటికల్ కామెంట్స్ అనేది గవర్నర్ పరిధి కాదన్నారు.
కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపింది.. కాబట్టే జీతాలు ఒకటి రెండు రోజులు ఆగుతున్నాయన్నారు. అప్పులు అనేది అభివృద్ధికి అవసరమేనన్నారు. రాజకీయ పార్టీల్లో అసమ్మతి అనేది సహజమేనన్నారు. కౌన్సిల్లో ప్రశ్నలు అడిగే ప్రతిపక్షం లేదన్నారు. వాళ్లు మాట్లాడితే టైం ఇవ్వడానికి తాము సిద్ధమన్నారు. సభలో ప్రశ్నించే సభ్యులు ఉంటేనే..ప్రజలకు సరైన సమాధానం వస్తుందన్నారు. విపక్షాలకు సరైన ఆయుధాలు లేకపోతేనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తాయన్నారు. నిత్యవసర వస్తువులపై జీఎస్టీ వేయడం అన్యాయమన్నారు.
సీఎం నాయకత్వంలో అందరం కలిసి ఉన్నామని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో క్వాలిటీ, క్వాంటిటి తగ్గుతోందన్నారు. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానన్నారు. పోటీ చేయాలా? వద్దా? అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మునుగోడులో పోటీకి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఎన్నికల్లో పోటీ అంశం నా పరిధి కాదన్నారు. ఈటెలకు టచ్‌లో ఉన్నది ఎవరో అన్నది ఆయనకు తప్ప మరొకరి తెలియదన్నారు. నాయకులు పార్టీ మారేది అనేది ఎన్నికల సమయంలో సహజమని, హుజురాబాద్, హుజూర్‌నగర్‌లో 95శాతం హామీలు నెరవేర్చారన్నారు.
నల్గొండ జిల్లాలో నాది ఆధిపత్యం ఎప్పుడూ లేదు.. పెరిగేది ఉండదు.. తగ్గేది ఉండదన్నారు. మా జిల్లాలో గ్రూప్‌లు లేవని, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నామన్నారు. ప్రధానిపై సీఎం పార్లమెంట్ పరిధిలో ఉన్న భాషను మాత్రమే వాడుతున్నారన్నారు. పార్లమెంట్ బ్యాన్ చేసిన అంశం కరెక్ట్ కాదన్నారు. వారు బ్యాన్ చేసిన ప్రతి పదం బ్యాన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంట్- అన్ పార్లమెంట్ అనే పదాలకు ముందు ఒక గైడ్‌లైన్స్ ఇవ్వాలన్నారు.