Legislative Council | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ శాసన మండలి సమావేశాలు ఆరో రోజు ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రత్యేక మోషన్స్పై ఉపాధ్యాయ సభ్యులు రఘోత్తమ్‌రెడ్డి, నర్సిరెడ్డి, ఎంవీఎన్రెడ్డి, నవీన్‌కుమార్, తాతామధు, వాణీదేవి, టీ జీవన్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న, బల్మూరి వెంకట్, బేగ్ తదితరులు మాట్లాడారు. తీన్మార్ మల్లన్న, బల్మూరి వెంకట్, జీవన్‌రెడ్డి, అల్గుబెల్లి నర్సిరెడ్డి పిటిషన్లు అందించారు. కాగ్ 2023 ఆడిట్ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి 2014-15 నుంచి 2019-20 వరకు వార్షిక నివేదికలు సభ ముందుంచారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ, సుప్రీంకోర్టు తీర్పుపై సభలో చర్చ జరిగింది.
సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ సభాపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి స్వాగతించారు. అనంతరం గోరటి వెంకన్న మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలులో ప్రభుత్వం ఎందుకు తొందరపడుతున్నదని ప్రశ్నించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరిగింది. పలువురు సభ్యులు సూచనలు, సలహాలివ్వడంతో పాటు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. డిగ్రీ, పీజీ స్థాయిలో యువతకు నైపుణ్యాలు రాత్రికి రాత్రే నేర్పిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు నేర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశ్‌పతి శ్రీనివాస్ సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నిధులు ఎలా సమీకరిస్తారని, బోధకులను ఏ ప్రాతిపదికన నియమిస్తారని, అడ్మిషన్ల విధానం, స్టూడెంట్ అవుట్ రీచ్ ఎలా ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఐటీఐలు, పలు యూనివర్సిటీలు ఖాళీ అవుతున్నాయని, వాటిలో స్కిల్స్ యూనివర్సిటీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సూచించారు. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై అనేక అనుమానాలున్నాయని, మరింత లోతైన అధ్యయనం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు అభిప్రాయపడ్డారు. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ అగ్రికల్చర్, డైరీ టెక్నాలజీ, వెటర్నరీ వంటి అంశాలపై యువతకు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోర్సులను ప్రవేశ పెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మధుసూదనాచారి, టీ జీవన్‌రెడ్డి, ఎంవీఎన్ రెడ్డి తదితరులు అభిప్రాయాలు తెలిపారు. అనంతరం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు.
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తున్నది. ఎస్సీ వర్గీకరణపై 2014లోనే నాటి సీఎం కేసీఆర్ అన్ని పార్టీల ఆమోదంతో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రధానిని కలిసిన ప్రతి సందర్భంలో ఒత్తిడి కూడా తెచ్చారు. ఈ తీర్పు రావడంలో కేసీఆర్ పాత్ర కూడా కీలకం. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటును ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుత విద్యావ్యవస్థలో 20 ఏండ్లు చదివిన తర్వాత ఉద్యోగాల్లో చేరే సమయానికి ప్రత్యేక కోర్సులు చదవాల్సి వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో స్కిల్స్ యూనివర్సిటీ రావడం మంచి పరిణామం.
-సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ పక్ష నేత
మాలల హక్కుల కోసం ఉద్యమిస్తాం
దేశంలో మెజార్టీ ప్రజల డిమాండ్ ఎస్సీ వర్గీకరణ. మాల-మాదిగల మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. దమాషా ప్రకారం మాలలకు వాటా ఇవ్వాలి. నిష్పక్షపాతంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. మాదిగలకు వ్యతిరేకం కాదు. మాలల రిజర్వేషన్ హక్కుల కోసం ఉద్యమించాలి. వర్గీకరణ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు స్వలాభం కోసం వాడుకున్నారు. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నది?
-గోరటి వెంకన్న, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
పాలేరు ఆయకట్టుకు అన్యాయం
సీతారామ ప్రాజెక్టు నీళ్లను మంత్రులు తమ సొంత ప్రాంతాలైన మధిర, సత్తుపల్లికి తీసుకెళ్తున్నారు. దీనివల్ల పాలేరుకు అన్యాయం జరుగుతున్నది.
-తాతా మధు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
తలసేమియాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
ఆరోగ్య శ్రీ సేవల్లో తలసేమియా వ్యాధిని చేర్చాలి. తలసేమియా బాధితులు నెలల వ్యవధిలో కొత్త రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది.
-నవీన్‌కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ