ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 29: రాత్రి సమయంలో చేనులో పత్తిని దొంగిలించారు.. ఆపై సాగు చేసిన వ్యక్తికే విక్రయించి అడ్డంగా దొరికారు.. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లిలో శుక్రవారం వెలుగుచూసింది. కాగా, దొంగలను చెట్టుకు కట్టేసి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గొల్లపల్లికి చెందిన గోగూరి పెద్ద శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయంతోపాటు పత్తి కొనుగోలు చేస్తుంటారు. ఇదే గ్రామానికి చెందిన కారంగుల గంగ, వేముల వంశీ గురువారం రాత్రి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన చేనులో 25 కేజీల పత్తి సంచిని దొంగిలించారు. శుక్రవారం ఉదయం తిరిగి శ్రీనివాస్‌రెడ్డికే అమ్మారు. అది తన చేనులోని పత్తే అని గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి దీనిపై ఆరా తీయగా నిందితులు చోరీ చేసినట్టు ఒప్పుకున్నారు. గ్రామానికి చెందిన వేముల శేఖర్, ఎల్లారెడ్డిపేటకు చెందిన కడమంచి కనుకరాజు, అలకుంట పర్శయ్య, నవీన్ పేర్లను వెల్లడించారు. వీరిలో శేఖర్, కనుకరాజును గ్రామస్థులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. కాగా, నిందితులు ఇటీవల చుట్టుపక్కల గ్రామాల్లోనూ కరెంట్ మోటర్లు, రోడ్డు పక్కనున్న పాన్‌డబ్బాలు, గొర్రెలు, మేకల దొంగతనాలకు పాల్పడినట్టు తెలిసింది.