గద్వాల : పత్తి కొనుగోళ్లు (Cotton procurement ) సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ (Collector BM Santosh ) అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతులకు తగిన మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని, అవసరం మేరకు గద్వాలలో రెండు, అలంపూర్లో ఒకటి చొప్పున మూడు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్టోబర్ మాసం చివరి వారం నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
పత్తి తేమశాతం 8 వరకు ఉండాలని, పత్తి కొనుగోలుకు కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా వ్యవసాయ విస్తీర్ణాధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ యాప్ ద్వారానే రైతులు స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, వ్యవసాయ శాఖ ఏడీ సంగీత లక్ష్మి, సీసీఐ అసిస్టెంట్ మేనేజర్ దిలీప్, లీగల్ మెట్రాలజీ, పోలీస్, ఫైర్ శాఖ అధికారులు పాల్గొన్నారు.