హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి అన్ని మిల్లుల్లో అధికారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. మొత్తం 330 మిల్లులను నోటిఫై చేయగా, సీసీఐ అన్నింటిని ప్రారంభించకుండా, మొన్నటివరకు దశలవారీగా వాటిని ప్రారంభించింది. పత్తిని విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నోటిఫై చేసిన మొత్తం 330 మిల్లుల్లో కొనుగోళ్లు చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు సీసీఐ రాష్ట్రంలో మొత్తం 4.03 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించగా, దీని కొనుగోలు విలువ రూ.3,201 కోట్లుగా నమోదైనట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు.