ఆసిఫాబాద్ టౌన్, డిసెంబర్ 20 : పత్తి పంట దిగుబడి రాలేదనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ పంచాయతీ పరిధిలోని గొల్లగూడకు చెందిన ఉప్పరి లచ్చయ్య (58) ఏడు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు.
అధిక వర్షాల ప్రభావంతో ఆశించినంత దిగుబడి రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. శుక్రవారం చేనుకు వచ్చిన కూలీలను సాయంత్రం ఇంటికి పంపించాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతుకుంటూ చేను వద్దకు వెళ్లగా చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే లచ్చయ్యను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.