కుమ్రంభీం ఆసిఫాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పత్తి పంట దిగుబడి రాక.. ఓ రైతు(Cotton farmer) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జైనూర్ ఎస్ఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామానికి చెందిన రైతు డక్రే రాందాస్ తనకున్న రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు.
పత్తి పంట సరిగ్గా పండక పోవడంతో మనస్థాపం చెంది గురువారం సాయంత్రం గ్రామ శివారులోని రోడ్డు పక్కన పురుగు మందు తాగి స్పృహ కోల్పోయి పడి ఉండడంతో అతని భార్య శకుంతలతొ పాటు ఆమె మరిది దేవిదాస్ మరియు అల్లుడు కలసి రాందాస్ ను వెంటనే ఉట్నూరు హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో శుక్రవారం మృతుడి భార్య శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.