హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వానికి ఏటా రూ.40 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుతున్న తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌పై కొందరు వ్యక్తులు, మీడియా సంస్థలు బురదజల్లడాన్ని ఉద్యోగులు తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు తమకు అండగా నిలవాలని కార్పొరేషన్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘం నాయకులు, తెలంగాణ ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు శుక్రవారం ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుని కలిసి విన్నవించారు. కొన్ని మీడియాల్లో వస్తున్న అసత్య వార్తలను ఖండిస్తూ వాస్తవాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కార్పొరేషన్లో 280 మంది ఉద్యోగులు పని చేయాల్సి ఉండగా, 104 మంది ఉద్యోగులే రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారని వివరించారు.
ప్రత్యక్షంగా 1,800 మంది హమాలీ కార్మికులు, అనుబంధంగా 5 వేల కుటుంబాలకు పరోక్షంగా బేవరేజెస్ కార్పొరేషన్ జీవనోపాధి కల్పిస్తున్నదని, ఇకనుంచైనా తప్పుడు వార్తలు రాయకుండా చూడాలని కోరారు. సంస్థపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని విన్నవించారు. తాను కూడా ఉద్యోగుల పక్షానే ఉంటానని జూపల్లి హామీ ఇచ్చారు. అనంతరం వారు ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. కలిసిన వారిలో తెలంగాణ ప్రభుత్వరంగ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదారి జీటీ జీవన్, అధ్యక్షుడు, బ్రూవరీస్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం కాశీనాథ్, ఉపాధ్యక్షుడు శ్యామ్‌కుమార్, అడ్వరైజర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
తనకు తెలియకుండా కొత్త మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్న ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహాంపై బదిలీవేటు వేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.