హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్‌కు అమరువీరుల స్థూపాన్ని తాకే అర్హత లేదని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో సమైక్యవాదులకు వత్తాసు పలికిన రేవంత్.. స్థూపాన్ని తాకితే అమరుల ఆత్మ ఘోషిస్తుందని తెలిపారు. నాడు ఉద్యమకారులను రైఫిల్‌తో బెదిరిస్తూ ఉద్యమ నినాదాన్ని కనుమరుగు చేయడానికి ఆయన కుట్ర చేశాడని విమర్శించారు.
కేసీఆర్ పోరాటం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పని చేస్తున్నారని కొనియాడారు. అలాంటి కేసీఆర్‌ను విమర్శించే నైతికత రేవంత్‌కు లేదని మండిపడ్డారు. తన ప్రాణాన్ని సైతం లెక చేయకుండా పోరాడిన కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌కు ప్రజల్లో విశ్వసనీయత లేదని, కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచడం ఖాయమని పేర్కొన్నారు.