ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:46:17

కరోనా మరణాలు ఒక్క శాతమే

కరోనా మరణాలు ఒక్క శాతమే

 • రాష్ట్రంలో 85% కేసుల్లో లక్షణాలు లేవు
 • ఉచితంగా హోం ఐసొలేషన్‌ కిట్ల పంపిణీ
 • టిమ్స్‌లో వైద్య కార్యకలాపాలు మొదలు
 • ఇకపై డ్యాష్‌బోర్డ్‌లో ఖాళీ బెడ్ల వివరాలు
 • మీడియాతో హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు
 • 65.48% రాష్ట్రంలో రికవరీ రేటు
 • 9,786 హోం ఐసొలేషన్‌లో
 • 1,831 ప్రైవేట్‌లో చికిత్స పొందుతున్న వారు
 • 90% ప్రభుత్వ దవాఖానల్లో ఖాళీగా ఉన్న బెడ్లు
 • అందుబాటులోకి టెలిమెడిసన్‌ సేవలు
 • హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి : 1800 599 4455
 • అన్ని రకాల సలహాలకు : 104/1800 599 12345

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా మరణాలు ఒక్క శాతం మాత్రమేనని, ప్రజలు ఆందోళనచెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. దేశంలో వైరస్‌ మరణాల రేటు 2.7% ఉంటే.. తెలంగాణలో ఒక్క శాతమే ఉన్నదని వివరించారు. రాష్ట్రంలో 85% మంది బాధితులకు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. ప్రస్తుతం 9,786 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. పాజిటివ్‌ ఉండి హోంఐసొలేషన్‌లో ఉన్నవారికి ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటుచేశామని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌ శ్రీనివాస్‌రావు చెప్పారు. సలహాలు, సందేహాలకు 104 లేదా 1800 599 12345 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. హోంఐసొలేషన్‌ ఉన్నవారికి ప్రత్యేకంగా 1800 599 4455 నంబర్‌లో సలహాలు ఇస్తారని తెలిపారు. మంగళవారం డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎంపికచేసిన ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానలతోపాటు జిల్లాల్లోని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోనూ కరోనా చికిత్సలు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. 

జీహెచ్‌ఎంసీలో 300 సెంటర్లు, మిగతా జిల్లా, ఏరియా దవాఖానల్లో అవసరమైనవారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పడకల కొరత లేదని స్పష్టంచేశారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నదన్నారు. ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వచ్చే మూడు నెలల్లో వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని తెలిపారు. పది రోజులుగా వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచామని, రాష్ట్రంలో రికవరీ రేటు 65.48% ఉన్నదని వివరించారు. జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలుంటే సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. ప్రైవేట్‌ దవాఖానల్లో మొత్తం 1,831 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఉచితంగా కరోనా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామని, 10 కాలేజీల్లో మొత్తం 10 వేలకుపైగా బెడ్లు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. 

ఇప్పటికే  మల్లారెడ్డి, కామినేని, మమత మెడికల్‌ కాలేజీల్లో చికిత్స ప్రారంభమైందన్నారు. మొత్తం 90 అంబులెన్సులను ప్రత్యేకంగా ఏర్పాటుచేసినట్టు చెప్పారు. రోగులకు ఆధునిక ఔషధాలు ఇచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో పడకలు పుష్కలంగా ఉన్నాయని, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు ప్రభుత్వ దవాఖానలకు రావాలని సూచించారు. పాజిటివ్‌ ఉండి హోంఐసొలేషన్‌లో ఉన్నవారికి ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటుచేశామన్నారు. ఉచితంగా హోంఐసొలేషన్‌ కిట్లు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో ర్యాపిడ్‌ టెస్టులు పెద్దసంఖ్యలో చేస్తున్నట్టు  చెప్పారు.


డ్యాష్‌ బోర్డులో పడకల వివరాలు

ఏ దవాఖానలో ఎన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో తెలిపే వివరాలను రియల్‌ టైం డ్యాష్‌బోర్డులో ప్రదర్శిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో 90% బెడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి వైద్యాధికారులు ఫోన్లుచేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారని, అవసరం ఉన్నవారిని దవాఖానలకు రావాలని, లేనివారిని హోంఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారని వివరించారు. వైద్యులను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోవద్దని హెచ్చరించారు. 

టిమ్స్‌లో సేవలు ప్రారంభం

కరోనా ప్రత్యేక దవాఖాన అయిన గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యసేవలు సోమవారం నుంచి ప్రారంభమైనట్టు శ్రీనివాసరావు తెలిపారు. టిమ్స్‌లో నిర్ధారణ పరీక్షలతోపాటు అవసరమైనవారిని దవాఖానలో చేర్చుకొని చికిత్స అందిస్తామని చెప్పారు. టిమ్స్‌ అన్ని విధాలా సిద్ధమైందని, వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు.  

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళన సరికాదు

కరోనా కష్టకాలంలో గాంధీ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళనకు దిగడం సరికాదని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌రెడ్డి అన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఇప్పటికే మాట్లాడారని తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నామని, జీతంతోపాటు ఇన్సెంటివ్‌ ఇస్తామని తెలిపినా మొండిపట్టు పట్టడం సరికాదన్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంశం తమ పరిధిలో లేదని, కోర్టులో కేసులున్నాయని గుర్తుచేశారు. నాలుగురోజులుగా విధులకు హాజరుకాకపోవడం, వచ్చేవారిని అడ్డుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. 


logo