హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పథకాలు కేంద్రానికి పెద్ద దిక్కుగా మారాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రైతుబంధు’ను చూసి ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని మోదీ సర్కారు అమలు చేసింది. ఇప్పుడు మరో పథకాన్ని కాపీ కొట్టింది. రాష్ట్రంలోని మత్స్యకారులకు ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేసింది. 2016-17లో ప్రారంభమైన ‘చేపల పంపకం కార్యక్రమం’ వల్ల మత్స్యకారులకు జీవనోపాధి లభించింది. మంచి ఆదాయం లభిస్తున్నది.
ప్రభుత్వ చర్యలతో మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ విజయవంతంగా అమలవుతున్న పథకాన్ని చూసి కేంద్రం కూడా 2023-24 బడ్జెట్లో మత్స్యకారుల కోసం ‘ప్రధాన్‌మంత్రి మత్స్య సంపద యోజన’ పేరుతో పథకాన్ని తీసుకొస్తామని తెలిపింది. మత్య్సకారులు, అమ్మకందారులు, సూక్ష్మ, చిన్న స్థాయి పరిశ్రమల ప్రోత్సాహానికి దీన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించింది. ఈ పథకానికి కేంద్రం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించింది.
మత్స్యకారుల కోసం 1,000 కోట్ల ఖర్చు
మత్స్యకారులకు ఆర్థిక స్వావలంబన కల్పించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ 2016-17లోనే దేశంలో మరెక్కడా లేనివిధంగా ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.415 కోట్లు ఖర్చు చేసి 400 కోట్లకు పైగా చేపపిల్లలను జలాశయాల్లో విడుదల చేసింది. ఈ పథకం గ్రామాల్లో రూ.25 వేల కోట్ల సంపదను సృష్టించింది. ఆర్థిక లబ్ధి, మార్కెటింగ్ కోసం మత్స్యకారులకు ప్రభుత్వం నేరుగా రూ.550 కోట్ల ఖర్చుతో 63 వేల వాహనాలను పంపిణీ చేసింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం సుమారు రూ.వెయ్యి కోట్ల ఖర్చుతో ఉచిత చేప పిల్లల సరఫరా, వాహనాల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నది.