హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లోని విద్యార్థులకు ఫోర్టిఫైడ్ రాగిజావ పంపిణీ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. 1 నుంచి 10వ తరగతి వరకు గల విద్యార్థులకు రాగి జావ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నవీన్ నికోలస్ అధికారులను ఆదేశించారు.
‘కడా’కు30 కోట్లు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా)కి 30 కో ట్ల విడుదలకు పరిపాలన అనుమతులిస్తూ శనివారం ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 2025-26 బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కడా చైర్మన్, వికారాబాద్ కలెక్టర్‌కు ఈ మొత్తం విడుదలకు ఆదేశాలిస్తూ ప్రభుత్వ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ జీవో జారీచేశారు.
‘డిజిటల్’ పై పుస్తకం
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): డిజిటల్ లెర్నింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేకంగా ‘ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ పాఠ్యపుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ విద్యాసంవత్సరంలోనే ఈ పుస్తకాన్ని తీసుకురానుండగా, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు అందిస్తారు.
టీచర్ల సర్దుబాటు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): టీచర్ల పదోన్నతుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మరోసారి మిగులు టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా కలెక్టర్లు సర్దుబాటు చేశారు.
డీఎస్పీలకు పదోన్నతి
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): పోలీస్‌శాఖలో ఏడుగురు డీఎస్పీలకు (నాన్‌కేడర్) అడిషనల్ ఎస్పీలుగా తాత్కాలిక పదోన్నతులు కల్పిస్తూ శనివారం రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 15రోజుల్లో డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.