కట్టెల పొయ్యిలతో వంటింటి కాలుష్యం పెరుగుతున్నది. ఫలితంగా ఆడవాళ్ల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ముఖ్యంగా.. పొయ్యిలోంచి వచ్చే పొగ.. మహిళల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు).. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం ఈ ఆందోళనకరమైన విషయాన్ని వెల్లడించింది. కాలుష్యకారక వంట ఇంధనాలు మహిళల మెదడుపై ప్రభావం చూపుతున్నట్లు ఈ సర్వే గుర్తించింది.
ఇందుకు సంబంధించిన వివరాలను ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్ ఆగ్నేయాసియా జర్నల్’లో ప్రచురించింది. ఈ అధ్యయనం కోసం 45 ఏళ్లకు పైబడ్డ 4,100 మందిని పరిశోధకులు ఎంచుకున్నారు. వీరిలో దాదాపు వెయ్యి మంది బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్లు తీసుకొని విశ్లేషించారు. అందులో వంటింటి వాయు కాలుష్యానికి గురైన మహిళల్లో ‘హిప్పోకాంపస్ వాల్యూమ్స్’ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
మెదడులోని ఈ భాగం జ్ఞాపకశక్తికి చాలా ముఖ్యమైనదనీ, వంటింటి పొగ.. దీన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని అధ్యయనకారులు వెల్లడించారు. దీర్ఘకాలంలో గ్రామీణ ప్రాంత మహిళల్లో చిత్తవైకల్యం పెరిగే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ మహిళలు వంట కోసం ఘన ఇంధనాలను మండిస్తుంటారు. అంతేకాకుండా.. పల్లెల్లోని వంట గదుల్లో గాలి, వెలుతురు కూడా సరిగా ఉండదు. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో కార్బన్, నైట్రోజన్, సల్ఫర్తోపాటు భారీ లోహాల ఆక్సైడ్లు విడుదలై.. వాయు కాలుష్యాన్ని కలిగిస్తాయి.
ఇవి మహిళల మెదడుకు పొగ బెడుతాయి. వివిధ మార్గాల్లో మెదడును ప్రభావితం చేస్తాయి. ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్తోపాటు దీర్ఘకాలంలో చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి వంటి పరిస్థితులకు దారితీస్తాయి. కాబట్టి, గ్రామీణ మహిళల్లో ఆరోగ్య అక్షరాస్యతతోపాటు శుభ్రమైన వంట ఇంధనాన్ని వాడేలా ప్రోత్సహించాలని సర్వేకారులు సూచిస్తున్నారు.