హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖగా మార్చాలని సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖగా ఉండేదని, 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని వ్యవసాయ శాఖగా మార్చారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ ప్రభుత్వం వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే పేరు మారుస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు.