Telangana | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ శాఖపై ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఎవరికి వారుగా సమీక్షలు నిర్వహిస్తూ పరస్పర విరుద్ధమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదే అదునుగా వారి అండతో పలువురు ఇంజినీర్లు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం టెండర్లపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో వివాదం చెలరేగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీటిని అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. రూ.7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న పరిపాలనా పరమైన అనుమతులిచ్చింది. ఆ తర్వాత 2018 ఆగస్టులో ఈ పథకం అంచనా వ్యయాన్ని రూ.13,057 కోట్లకు సవరించింది. అందులో ప్రాజెక్టు మెయిన్ కెనాల్తోపాటు సత్తుపల్లి ట్రంక్ కెనాల్, పాలేరు లింక్ కెనాల్ ఉన్నాయి. వాటితోపాటు 8 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులకు సంబంధించిన రూ.1,800 కోట్ల అంచనాలను ప్రభుత్వం ప్రభుత్వం ఆమోదించింది. వాటిలో ఇప్పటివరకు రూ.768 కోట్లు విలువ చేసే పనులకు మాత్రమే ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ.. ఇంకా రూ.1,074 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉన్నది. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరిగేషన్ సర్కిల్ అధికారులు మాత్రం మంత్రుల నోటిమాట ఆధారంగా ఆ పనులకు కూడా టెండర్లను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.
ఎవరికి వారుగా సమీక్షలు
ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇరిగేషన్ పనులపై ఎవరికి వారుగా జిల్లా ఇంజినీర్లతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌తో కలిసి వేర్వేరుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలా ఒక్క సీతారామ ప్రాజెక్టు పనులపైనే పలుమార్లు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించడం గమనార్హం. అందులో భాగంగా సెప్టెంబర్‌లోనూ ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపినందున తదుపరి అన్ని అనుమతులను సత్వరమే పూర్తి చేసి టెండర్లను ఆహ్వానించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ సమావేశంలో స్పష్టం చేశారు. కానీ, సంబంధిత ఇంజినీర్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. రూ.768 కోట్ల విలువైన డిస్ట్రిబ్యూటరీ పనులతోపాటు ఆర్థిక శాఖ ఆమోదం తెలపని రూ.1,074 కోట్ల విలువైన పనులకు సైతం టెండర్లను పిలిచారు. ఇదేమిటని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే.. పనుల్లో జాప్యం జరగరాదన్న మంత్రుల ఆదేశాల మేరకే టెండర్లను ఆహ్వానించామని, ఆ పనులను చేపట్టేందుకు అవసరమైన అనుమతులను తర్వాత పొందుతామని ఇంజినీర్లు దబాయిస్తున్నారు. దీనిపై తాజాగా మంత్రి ఉత్తమ్ నిర్వహించిన సమీక్షలో తీవ్ర దుమారం చెలరేగినట్టు తెలుస్తున్నది. అనుమతుల్లేకుండా టెండర్లను ఎందుకు ఆహానించారని ఆయన నిలదీయడంతో జిల్లా మంత్రుల ఒత్తిడి మేరకే ఆ విధంగా చేయాల్సి వచ్చిందని ఇంజినీర్లు బదులిచ్చినట్టు సమాచారం.
ఈఎన్సీపై వేటుకు రంగం సిద్ధం?
ఆది నుంచి అన్ని అంశాల్లోనూ ఎంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ పట్ల పలువురు ప్రభుత్వ పెద్దలతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు, ఇంజినీర్లు గుర్రుగా ఉన్నట్టు ప్రచారం కొనసాగుతున్నది. పరిపాలన అనుమతులు పొందిన తర్వాతే టెండర్లను ఆహ్వానించాలని, అందుకు సంబంధించిన అంచనాలను రూపొందించి పంపాలని ఈఎన్సీ ఆది నుంచే స్పష్టంగా చెప్తున్నారు. కానీ, ఆ ఆదేశాలను ఇంజినీర్లు తుంగలో తొక్కి అనుమతుల్లేకుండానే టెండర్లను ఆహ్వానించడంతోపాటు నిబంధనల ప్రకారం ముందుకు పోవాలంటున్న ఈఎన్సీపై ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఈఎన్సీని తక్షణమే తొలగించాలంటూ ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. అందుకు సంబంధించిన దస్ర్తాలు ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి వద్దకు చేరినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇదంతా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల ప్రోద్బలంతోనే జరుగుతున్నట్టు ఇరిగేషన్ అధికారులు చర్చించుకుంటున్నారు.