జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మైనార్టీలను మభ్యపెట్టేందుకు, వారి ఓట్లను బుట్టలో వేసుకు నేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఖబరస్థాన్‌కు ఆగమేఘాలపై స్థలం కేటాయించగా, అది కాస్తా వివాదాస్పద స్థలమని తేలింది. ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలం ప్రకటించగా, అది కూడా వివాదాల్లో ఉన్నదేనని బయటపడింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hill) కీలకంగా ఉన్న మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు ఆశచూపిన రేవంత్ సర్కారు (Revanth Reddy) ప్లాన్ బెడిసికొట్టింది. ఖబరస్థాన్‌కు స్థలం ఇస్తామంటూ మోసం చేసింది. వివాదాల్లో ఉన్న స్థలాన్ని శ్మశాన వాటికకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తీరా ముస్లిం పెద్దలు వెళ్లి చూస్తే అది వివాదాల్లో ఉన్నట్టు తేలింది. ఆ భూమిని దాతలు ప్రార్థనలు చేసుకోవడానికి విరాళంగా ఇచ్చారని స్పష్టమైంది. శ్మశానం కోసం స్థలం కోరితే ప్రార్థనలు చేసే భూమిని ఎలా కేటాయిస్తారని మైనార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో వారిని చల్లబరిచేందుకు మరో స్థలం చూపగా, అది కూడా వివాదాల్లో ఉన్నదని, పైగా దశాబ్దాల కిందటే ఆ స్థలాన్ని శ్మశానవాటికకు కేటాయించారని తేలింది. దీంతో మైనార్టీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఇదంతా చూస్తుంటే తమను మభ్యపెట్టి, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ఆడుతున్న నాటకమంటూ మండిపడుతున్నారు.
తప్పుడు ఉత్తర్వులు.. వివాద స్థలం కేటాయింపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కొన్ని రోజులుగా మంత్రులు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని ముస్లిం పెద్దలు పలుమార్లు వారికి విన్నవించారు. పాత శ్మశాన వాటికలన్నీ నిండిపోయాయని నియోజకవర్గంలో ఎక్కడైనా స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికల కోడ్ అమలుకు రెండు రోజుల ముందు.. ఖైరతాబాద్ మండలం షేక్‌పేట గ్రామంలోని వార్డు-8, బ్లాక్-1లోని 2500 గజాల స్థలాన్ని కేటాయించినట్టు ఈ నెల 4న వక్ఫ్‌బోర్డు నుంచి ఉత్తర్వులు జారీచేశారు. ఇదే విషయాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ అధికారికంగా ప్రెస్మీట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మత పెద్దలు, మైనార్టీ నేతలు సంబంధిత స్థలాన్ని ఆదివారం పరిశీలించేందుకు వెళ్లారు. వారి రాకను గమనించి ఆర్మీ అధికారులు అక్కడికి చేరకున్నారు. కేటాయించిన భూమి వివాదంలో ఉన్నదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
దీంతో మైనార్టీ పెద్దలు ఆరా తీయగా, ఆ స్థలాన్ని కొంతమంది దాతలు వక్ఫ్‌కు ఇచ్చారని, దాన్ని ప్రార్థనల కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని షరతు (మన్ షాయే వక్ఫ్) విధించారని తేలింది. వాస్తవానికి ప్రభుత్వం కేటాయించిన భూమిని శ్మశానవాటిక (ఖబరస్థాన్) కోసం వాడాలనుకుంటే ముందుగా మత పెద్దలు చర్చించి, ఫత్వా జారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత 11 మంది సభ్యులతో కూడిన వక్ఫ్ బోర్డు కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, తీర్మానం ఆమోదించి, సీఈవో సంతకం చేయాలి. కానీ వీటన్నింటినీ ఉల్లంఘిస్తూ స్పెషల్ ఆఫీసర్ పేరిట ఎవరితోనో సంతకం చేయించి, శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారని మైనార్టీలు చెప్తున్నారు. ఇటు చట్టపరంగా, అటు మతపరంగా చెల్లుబాటు కాని భూమిని తమకు ఇచ్చి మోసం చేస్తున్నారంటూ ముస్లిం పెద్దలు కాంగ్రెస్‌ను తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ మోసంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా ఆగ్రహం పెల్లుబికింది.
కప్పిపుచ్చుకునేందుకు మరో మోసం
వివాద స్థలాన్ని కేటాయించిన విషయం బయటపడటంతో, ఆ తప్పును కప్పిపుచ్చకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో మోసానికి తెరలేపింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొన్ని గంటల ముందు హడావుడిగా ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న 7,500 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో మరో ప్రచారం మొదలు పెట్టింది. కాంగ్రెస్ మోసాల గురించి తెలిసిన పలువురు మత పెద్దలు ఆ స్థలం గురించి ఆరా తీశారు. ఎర్రగడ్డలోని స్థలం కూడా వివాదంలోనే ఉన్నట్టు తేలింది. దశాబ్దాల కిందటే ఆ స్థలాన్ని శ్మశానవాటికకు కేటాయించారని గుర్తించారు. అయితే ఆ స్థలంలోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఇన్నాళ్లూ పడావుగా ఉన్నట్టు తెలిసింది. ఆ స్థలానికి వెళ్లే దారిపై ఫంక్షన్‌హాల్స్ నిర్వాహకులు గతంలో కోర్టును ఆశ్రయించారని, న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సమాచారం. దీంతో ఆ స్థలమూ తమకు వచ్చే అవకాశం లేదని ముస్లిం పెద్దలు చెప్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మైనార్టీలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మోసాల మీద మోసాలు చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.