హైదరాబాద్, మే 29: రాష్ర్టానికి చెందిన టెక్నాలజీ దిగ్గజం కంట్రోల్ఎస్..హైదరాబాద్‌లో మరో డాటా సెంటర్‌ను ప్రారంభించింది. రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ డాటా సెంటర్ సంస్థకిది మూడోది కావడం విశేషం. 1.34 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,300 మంది కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ డాటా సెంటర్‌ను బాంబే స్టాక్ ఎక్సేంజ్ ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో ఫిన్‌టెక్ సంస్థలు డాటా సెంటర్లు భాగమయ్యాయని, భవిష్యత్తులో ఈ రంగం మరింత వృద్ధి చెందే అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా స్టాక్ ఎక్సేంజ్‌లకు కూడా డాటా సెంటర్ల అవసరం మరింత పెరిగిందని చెప్పారు. కృత్రిమ మేధస్సుతో అడ్వాన్స్ కూలింగ్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన ఈ సెంటర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా నిర్మించింది. గూగుల్, ఒరాకిల్, అజూర్, ఏడబ్ల్యూఎస్‌తో అనుసంధానం కానున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన మూడో డాటా సెంటర్‌ను కలుపుకొని మొత్తంగా దేశవ్యాప్తంగా ముంబై, చెన్నై, బెంగళూరు, నోయిడా, కోల్‌కతా, పాట్నాలో ఉన్న డాటా సెంటర్ల పూర్తి సామర్థ్యం 250 మెగావాట్లకు చేరుకుంది. 2029 నాటికి 600 మెగావాట్ల సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకుతగ్గట్టుగానే ప్రణాళికను వేగవంతం చేసినట్లు, దీంట్లో భాగంగానే నగరంలో మూడో డాటా సెంటర్‌ను నెలకొల్పినట్లు కంట్రోల్ఎస్ ఫౌండర్, సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరం డాటా సెంటర్ల హబ్‌గా మారుతున్నదని, కార్పొరేట్ సంస్థలు, క్లౌడ్ సర్వీసు సేవలు అందించే సంస్థలు ఇక్కడ అధికంగా ఉండటమే ఇందుకు కారణమన్నారు.