హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణలో భాగంగా ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు సింగరేణి డైరెక్టర్ బలరాం (పీఏడబ్ల్యూ) తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సింగరేణి బ్లాక్‌ల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జీఎంలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ‘బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్’ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల గ్రీన్ ఇన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా సింగరేణిలో ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టాలనే మీ నిబద్ధత స్ఫూర్తిదాయకం. తగ్గించు, పునర్వినియోగం, రీసైకిల్ అనే మీ నినాదం స్థిరమైన చర్యకు దారితీసింది. సమష్టి కృషితో మనం పరిశుభ్రమైన, పచ్చని భవిష్యత్తును సృష్టించుకోవచ్చు. మీ అంకితభావానికి ధన్యవాదాలు’ అని శుక్రవారం ట్విటర్లో అభినందనలు తెలిపారు.