హనుమకొండ, డిసెంబర్ 2 : బాధితులకు, అన్యాయం జరిగినవారికి బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ దీక్షాదివస్‌లో భాగంగా నాలుగోరోజు మంగళవారం ‘తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై మంగళవారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో న్యాయవాదులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్- 3 ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నాడు న్యాయవాదులు ముం దుండి కొట్లాడారని గుర్తుచేశారు.
ఉద్యమకారుల తరఫున కేసులు వాదించి ఉద్యమానికి చేదోడువాదోడుగా నిలిచారని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన తనలాంటి ఎందరికో కేసీఆర్ రాజకీయ అవకాశాలు ఇచ్చారని తెలిపారు. రానున్న మూడేండ్లు బీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల కృషి మరువలేనిదని తెలిపారు. లగచర్ల, ఫార్మా రైతులు, ట్రిపుల్ఆర్, హైడ్రా బాధితులు ఇలా కాంగ్రెస్ ఏ వర్గానికి అన్యాయం చేసినా వారు బీఆర్ఎస్నే ఆశ్రయిస్తున్నారని, వారి తరఫున బీఆర్ఎస్, లీగల్‌సెల్ పోరాడుతున్నాయని చెప్పారు.