హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ) : నిరుడు వానాకాలం పాడైన రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రజానీకం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రమాదకరమైన ప్రయాణం సాగిస్తున్నారు. రోడ్లు మరమ్మతులకు ప్రభుత్వం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడమే రోడ్ల దుస్థితికి కారణమని అధికారులు చెప్తున్నారు. రూ.300 కోట్లకు టెండర్లు పిలిస్తే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు విముఖత వ్యక్తంచేస్తున్నారని అంటున్నారు. సుమారు రూ.1000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని, అందుకే కొత్తగా పనులు చేపట్టడం లేదని కాంట్రాక్టర్లు స్పష్టంచేస్తున్నారు. గత బిల్లుల సంగతే ఏటూతేలని నేపథ్యంలో తాజాగా హైబ్రిడ్ యాన్యూటీ మోడ్(హెచ్ఏఎం)లో ఏకంగా రూ. 33వేల కోట్లతో 13వేల కిలోమీటర్లకు పైగా రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం మంత్రివర్గంలో నిర్ణయించిందని, వీటికి నిధులు ఇస్తుందన్న నమ్మకంలేదని కాంట్రాక్టర్లు పెదవి విరుస్తున్నారు.
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం మంత్రివర్గంలో పలు నిర్ణయాలు తీసుకుంది. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్లేన్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు నాలుగు వరుసల రోడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీనికోసం హ్యామ్ విధానాన్ని చేపడుతామని చెప్పింది. దశలవారీగా మొత్తం రూ. 28,000కోట్లతో 17,000 కిలోమీటర్లమేర ఆర్అండ్బీ రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్ రోడ్లతో కలుపుకుంటే ఈ మొత్తం రూ.33,194 కోట్లకు, మొత్తం రోడ్ల పొడవు 13,137 కిలోమీటర్లకు చేరుతుందని తెలిపింది.
హ్యామ్ విధానం ప్రకారం ముందుగా కాంట్రాక్టర్లు 60శాతం నిధులు బ్యాంకుల ద్వారా సమకూర్చుకుంటే మిగిలిన 40శాతం ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తుంది. కాంట్రాక్టర్లు ఖర్చుచేసిన 60 శాతం మొత్తాన్ని 15సంవత్సరాల్లో టోల్ ట్యాక్స్ ద్వారా వసూలు చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రోడ్లపై టోల్ వసూలుచేసే అవకాశం లేకపోవడంతో ఆ 60శాతం కూడా తామే దశలవారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదంతా అనుమానమే అని కాంట్రాక్టర్లు అంటున్నారు. అప్పులే పుడుతలేవని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రోడ్ల ఖర్చు కాంట్రాక్టర్లు భరించాలని, తర్వాత చెల్లిస్తామంటే ఎలా నమ్ముతాం? నిరుడు వానకాలంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.1000 కోట్లు చెల్లించకుండా ప్రభుత్వం తిప్పలు పెడుతున్నది. ఇప్పుడు రూ.33వేల కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మిస్తామని, కాంట్రాక్టర్లు ముందుగా జేబులో నుంచి ఖర్చు పెట్టుకోవాలని చెప్తే ఎవరైనా ఎలా నమ్ముతారు? అని ఓ కాంట్రాక్టర్ ప్రశ్నించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టర్లు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు కొత్త పనులు చేపట్టబోమని తేల్చిచెప్పారు. ఇటీవల కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళనకు దిగారు. అయినా కూడా వారి బిల్లులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం హ్యామ్ మోడల్లో ఏకంగా రూ. 33వేల కోట్ల విలువైన పనులు ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించడంపై కాంట్రాక్టర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హ్యామ్ రోడ్లపై ఇటీవల అధికారులు పలువురు కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా పనులు చేపట్టే ప్రసక్తేలేదని సమావేశంలో కూడా కాంట్రాక్టర్లు తేల్చిచెప్పినట్టు తెలుస్తున్నది.