Contract Lecturers | ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంటాక్ట్ అధ్యాపకులు చేస్తున్న సమ్మె శుక్రవారంతో ఏడో రోజుకు చేరింది. ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున మహిళా అధ్యాపకులతో సహా అందరూ హాజరై లేడీస్ హాస్టల్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధ్యాపకులందరూ పక్కనే ఉన్న ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్లి అధికారులు ఎవరూ తమకు సహకరించడంలేదని, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించే విధంగా దీవించాలని ఎల్లమ్మ తల్లికి తమ వినతి పత్రాన్ని అందజేశారు. తమ నిరవధిక సమ్మెలో భాగంగా ఓయూ పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కశ్మీర్‌లోని ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులకు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ.. కొంతమంది అధికారులు తాము ఏదో ఒక విధంగా పైరవి చేసుకొని పదవిలోకి రాగానే తమ ఉనికి మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారని ఆరోపించారు. అటువంటివారు మళ్లీ ఏదో ఒక రోజు పాత స్థానంలోకి వస్తారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పదవిని అడ్డుపెట్టుకొని అందరిని అణచివేయాలని చూడొద్దని సూచించారు. తమ న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులు బోధన చేసిన సర్టిఫికెట్లు యూజీసీ గుర్తింపునిచ్చి చెల్లుబాటు అయినప్పుడు వారి బోధనకు గుర్తింపు ఎందుకు ఉండదని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ రెగ్యులరైజేషన్ను ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ధర్నా శిబిరానికి బిజెపి రాష్ట్ర కార్యదర్శి కాచం వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం నాయకులు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ పరుశురాం, డాక్టర్ కుమార్, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ విజయీందర్ రెడ్డి, డాక్టర్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ వినీత పాండే, డాక్టర్ శైలజ రెడ్డి, డాక్టర్ నసీమా బేగం, డాక్టర్ పాండయ్య, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.