హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. జీవో 60 ప్రకారం రూ.15,600 ఇవ్వాల్సి ఉన్నా,కేవలం రూ.10,400 మాత్రమే ఇచ్చేలా జీవో తీసుకురావడం అన్యాయమని పేర్కొన్నారు.
శనివారం ఎన్హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎం ప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోఠిలోని ఎన్హెచ్ఎం డైరెక్టరేట్ ఎదుట భారీ ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ స్కీం కింద రాష్ట్రంలో దాదాపు వెయ్యిమంది నాలుగో తరగతి సిబ్బంది పనిచేస్తున్నట్టు చెప్పారు.
కనీస వేతనచట్టం ప్రకారం వారికి జీతాలు అమలుచేయాలని కోరారు. ఏడు నెలలుగా 300 వాహనాలకు అద్దెలు చెల్లించడం లేదని, ఓనర్ కం డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న వారికి ఈఎంఐ చెల్లింపులకు ఇబ్బందిపడుతున్నట్టు తెలిపారు.