హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పులు అమలుకావడం లేదు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ మార్గదర్శకాలను పాటించడం లేదు. ఎన్నాళ్లీ శ్రమదోపిడీ?’ అని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికి తగిన వేతనాలు ఇవ్వాలని, తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్ కోఠిలోని ఎన్హెచ్ఎం కార్యాలయం ఎదుట నేషనల్ హెల్త్‌మిషన్ (ఎన్హెచ్ఎం) పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు.
ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ సాధారణ సెలవులుగానీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు గానీ అమలు కావడం లేదని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులందరికీ రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్, ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వంటి సౌకర్యాలు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తమకు ఏడు నెలల పీఆర్సీ బకాయిలు రావాల్సి ఉన్నదని, రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా విడుదల చేయడం లేదని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు రాజేశ్‌ఖన్నా ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ యాప్‌ల్లో పనిచేయాలని అధికారులు ఆదేశిస్తున్నారని, కానీ వాటిని సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను గానీ, ఇంటర్నెట్ రీచార్జ్ వంటి సౌకర్యాలను కల్పించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, రెండో ఏఎన్ఎంల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల, కోశాధికారి పద్మ, జ్యోతితతతతత, కరుణ, కృష్ణవేణి, లక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.