హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): జాతీయ రహదారుల నిర్మాణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడులు సమకూర్చుకుంటున్న కాంట్రాక్టు సంస్థలు.. తమ పనులు పూర్తయ్యాక లాభం చూసుకొని టోల్ అధికారాలను ఆయా ఫైనాన్స్ సంస్థలు, ఫండింగ్ ఏజెన్సీలకు విక్రయిస్తున్నాయి. దీంతో ఇన్ఫ్రా ప్రాజెక్టులతో సంబంధంలేని సంస్థలు పెట్టుబడులు పెట్టి రోడ్ల నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను దక్కించుకుంటున్నాయి. అనంతరం తమ పెట్టుబడిని టోల్ ద్వారా వసూలు చేసుకుంటున్నాయి. టెండర్లలో రోడ్డు నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఆ ప్రాజెక్టు పూర్తయాక నిర్దేశిత గడువు వరకు టోల్ వసూలు చేసుకోవడం, తద్వారా తమ పెట్టుబడిని లాభంతో సహా రాబట్టుకోవడం గతంలో ఉన్న ఆనవాయితీ. కానీ, గత కొంతకాలంగా దేశంలో రహదారులను నిర్మిస్తున్న చాలా కాంట్రాక్టు సంస్థలు నిధుల కోసం ఫైనాన్సర్లపై ఆధారపడుతున్నాయి.
ఫండింగ్ ఏజెన్సీల నుంచి నిధులు సమకూర్చుకొని పనులు పూర్తయ్యాక టోల్ వసూలు అధికారాలను మరో ఫండింగ్ ఏజెన్సీకి విక్రయిస్తున్నాయి. ఈ విధంగా 2019 నుంచి 20 వేల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్కు సంబంధించిన రూ.95 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. కాంట్రాక్టు సంస్థలు, ఎన్హెచ్ఏఐ నుంచి టోల్ వసూలు అధికారాలను కొనుగోలు చేసిన పలు ప్రైవేటు ఫండింగ్ ఏజెన్సీలు.. రోడ్ల నిర్వహణ బాధ్యతలను మాత్రం ఆయా కాంట్రాక్టు ఏజెన్సీలకు లేదా ఇతర సబ్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నాయి. ఈ కొత్త పద్ధతుల వల్ల రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా పోయిందని చెప్పవచ్చు. కాంట్రాక్టు ఏజెన్సీలు ఎన్ని పనులు చేపట్టేందుకైనా ముందుకు రావడంతోపాటు త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నాయని రోడ్ల నిర్మాణ రంగం నిపుణులు చెప్తున్నారు.