SLBC | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన కార్మికులకు ప్రస్తుతం ఆక్సిజన్ అందుతున్నదా? లేదా? అనేది ఉత్కంఠంగా మారింది. ఈ విషయమై సైట్ ఇంజినీర్లతోపాటు కార్మికుల్లో ఆందోళన నెలకొన్నది. సాధారణ సమయాల్లోనే సొరంగంలో పూర్తిస్థాయి లో ఆక్సిజన్ అందదని, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉన్నదో? అని ఆందోళన చెందుతున్నారు. ఆక్సిజన్‌ను బయటనుంచి నిరంతరం సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్తున్నా అది అవతలి వైపునకు చేరుతున్నదా? లేదా? అనేది ప్రశ్నగా మారింది. గాలిని సరఫరా చేసే డక్ట్ సైతం దెబ్బతిన్నదని లోపలికి వెళ్లి వచ్చిన సహాయక బృందాలు చెప్తుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
సాధారణ సమయాల్లోనే కష్టం
లోతు, పొడవు పెరిగిన కొద్దీ సొరంగంలో ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా తగ్గిపోతుంటా యి. సాధారణ సమయాల్లోనూ అలాంటి ప్రాంతాల్లో కార్మికులు పనిచేయడం తీవ్ర కష్టతరమైంది. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ స్థాయిలు పడిపోకుండా ఉండేందుకు, స్వచ్ఛమైన గాలి వచ్చేందుకు సొరంగాలు నిర్మించే క్రమంలో అక్కడక్కడ వెంటిలేషన్ పాయింట్లను ఏర్పాటు చేస్తుంటారు. అంటే భూ ఉపరితలం నుంచి సొరంగం వరకు డ్రిల్ చేసి షాఫ్ట్ను ఏర్పాటు చేస్తారు. అయితే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగానికి సంబంధించి అలాంటి షాఫ్ట్ పాయింట్లు ఎక్కడా ఒక్కటి కూడా లేవు. కారణం సొరంగ ఉపరితలం పూర్తిగా అమ్రబాద్ టైగర్ అభయారణ్య ప్రాంతంలో విస్తరించి ఉన్నది. ఇక ఎస్ఎల్బీసీ సొరంగం భూ ఉపరితలం నుంచి 450 మీటర్లు (దాదాపు అర కిలోమీటర్) దిగువన ఉన్నది. మరోవైపు సొరంగంలో 500 మీటర్లు దాటగానే అక్సిజన్ పరిమాణం తగ్గుతూ ఉంటుంది.
ప్రస్తుతం 14 కి.మీ వరకు ఎస్ఎల్బీసీ సొరంగంలో పనులు పూర్తయ్యాయి. ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువ. సాధారణంగా నియమిత వాతావరణంలో 19% వరకు ఆక్సిజన్ ఉంటే అది సురక్షితం. ఈ నేపథ్యంలో సొరంగంలో నిర్దిష్ట స్థాయిలో ఆక్సిజన్‌ను ఉంచేందుకు ప్రత్యేక పైపుల ద్వారా బయటనుంచి లోపలికి పంపిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలోకి గాలిని సరఫరా చేసేందుకు సైతం 3.1 డయా కలిగిన పైపును సొరంగం పొడవునా ఏర్పాటు చేశారు. గాలిని పంపేందుకు 375 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు ఫ్యాన్లను కూడా నిరంతరం రన్ చేస్తున్నారు. అయినప్పటికీ, ఆక్సిజన్ కావాల్సిన మొత్తంలో అందని పరిస్థితి నెలకొంటుందని ఇంజినీర్లు వివరిస్తున్నారు. లోపల టీబీఎం, ఇతరత్ర డీవాటరీంగ్ మోటర్లు రన్ చేయడం వల్ల కూడా ఆక్సిజన్ స్థాయిలు కూడా తగ్గుతాయని చెప్తున్నారు. దీంతో సాధారణ సమయాల్లోనూ కార్మికులు సొరంగంలో నాలుగు గంటల పాటు కూడా పూర్తిసామర్థ్యం మేరకు పనిచేయని పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
కార్మికులకు ఆక్సిజన్ అందుతున్నదా?
టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) పొడవు 120 మీటర్లు. ప్రస్తుతం సొరంగంలో 14వ కి.మీ వద్ద పనులు చేస్తుండగా, అక్కడే ప్రమాదం జరిగింది. మట్టి, సిమెంట్ రింగులు టీబీఎంపై కూలిపోయాయి. కార్మికులు మిషన్లోపలే చిక్కుకుపోయారు. మిషన్ వెనక నుంచి సొరంగం పూర్తిగా మూసుకుపోయింది. ఇక టీబీఎంలోనూ స్వల్పంగానే ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇప్పటికీ 40 గంటలు దాటిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో లోపల ఉన్నవారికి ఆక్సిజన్ అందుతున్నదా? లేదా? అనే ఉత్కంఠ నెలకొన్నది. బయట నుంచి ఫ్యాన్ల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేసే డక్ట్ సైతం విరిగిపోయిందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయని భావిస్తున్నారు. అక్కడ కార్మికులు ఎలా ఉన్నారోనని సహచర కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.