హైదరాబాద్: ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎడతెరపిలేకుండా ముసురు కురుస్తున్నది. రాజధాని హైదరాబాద్‌లో రాత్రంతా వాన కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీవర్షపాతం నమోదయింది. దీంతో రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహిస్తున్నది. పలు ప్రాంతాల్లో ముందుజాగ్రత్తగా కరెంటును నిలిపివేశారు.
శనివారం రాత్రి 8.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు శేరిలింగంపల్లిలోని హఫీజ్‌పేటలో అత్యధికంగా 77.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక మాధాపూర్‌లో 63.8 మి.మీ., శివరాంపల్లిలో 60 మి.మీ, గాజులరామారంలో 56.0, బాలానగర్‌లో 53.0, మియాపూర్, చందూలాల్ బారాదరి, హైదర్‌నగర్ 52.3, కేపీహెచ్బీలో 52 మి.మీ., రాజేంద్రనగర్ 49.5, జూబ్లీహిల్స్ 47.5, రామంతాపూర్ 46.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

ఇదిలా ఉంటే రాగల మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదారబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.