Womens T20 World Cup : క్రికెట్లో ఆధిపత్యం చెలాయించే ఆస్ట్రేలియా (Australia) మరో ఐసీసీ ట్రోఫీ వేటలో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆరుసార్లు మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా నిలచిన ఆసీస్.. ఏడోసారి కప్‌ను తన్నుకుపోవాలనే కసితో ఉంది. నాకౌట్లో తిరుగులేని రికార్డున్న ఆస్ట్రేలియాను వెస్టిండీస్(West Indies) నిలువరిస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది. గతంలో ఏకంగా మూడుసార్లు కంగారుల జోరుకు నిలవలేక సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది విండీస్. దాంతో.. ఈసారి ఫలితం మారుతుందా? కంగారూలకు హేలీ మాథ్యూస్ (Hayley Mathews) సేన చెక్ పెడుతుందా? అనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది.
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ ఆఖరి దశకు చేరుకుంది. సెమీస్ బెర్తులు ఖారరవ్వడంతో ఫైనల్లో ఢీకొనేది ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం తొలి సెమీఫైనల్లో ఓవల్ మైదానంలో తలపడుతున్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తగ్గపోరు ఖాయమనిపిస్తోంది. చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన సోఫీ మొలినెక్స్(Sophie Molineux) బృందం రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉండగా.. ఐర్లాండ్ చేతిలో కంగుతిన్న విండీస్‌ను చరిత్రను తిరగరాయాలనుకుంటోంది.
ఆరుసార్లు ఛాంపియన్‌తో సెమీస్ పోరు గురించి మాట్లాడిన విండీస్ కెప్టెన్ మాథ్యూస్.. ‘మేము మైదానంలోకి దిగగానే ఓడిపోతామని ప్రతిఒక్కరు అనుకుంటున్నారు. కానీ, వారి ఆలోచన తప్పని నిరూపించాలని ఉంది. మా శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటే ఎంతటి జట్టునైనా ఓడిస్తాం’ అని ధీమా వ్యక్తం చేసింది.
ఐసీసీ ఈవెంట్లలో చెలరేగిపోయే ఆస్ట్రేలియా మహిళల జట్టు పదో సీజన్ టీ20 వరల్డ్‌కప్‌లో నాకౌట్ సమరానికి సిద్ధమవుతోంది. లీగ్ దశలో ఐదుకు ఐదు విజయాలతో సెమీస్ చేరిన ఆసీస్.. ఆరో విజయంతో ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో జోరు చూపిన వెస్టిండీస్.. వరసగా రెండు మ్యాచుల్లో ఓడింది. గ్రూప్ బీ చివరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో చిత్తైన హేలీ మాథ్యూస్ సేన న్యూజిలాండ్ నిష్క్రమణతో సెమీస్ బెర్తు దక్కించుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆసీస్‌ను నిలువరించాలంటే విండీస్ జట్టు గొప్పగా పోరాడాల్సిందే.
Australia have won their three T20 World Cup semi-finals against West Indies, but were knocked out at this stage in their previous T20 and ODI World Cup campaigns https://t.co/ir1IBY1rLe pic.twitter.com/9CnLzTjLHw
— Cricinfo (@cricinfo) June 30, 2026
మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో రికార్డులు ఆస్ట్రేలియాకు అనుకూలంగా ఉన్నాయి. గత తొమ్మిది ఎడిషన్లలో ఆ జట్టు రెండుసార్లు మాత్రమే సెమీస్‌లో వెనుదిరిగింది. 2009లో ఇంగ్లండ్ ధాటికి కుదేలైన ఆసీస్ 2024లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. ఇక వెస్టిండీస్‌ను మాత్రం మూడుసార్లు చిత్తు చేసింది. 2012లో 2014లో, 2018లో కరీబియన్ టీమ్ ఆశలపై నీళ్లు చల్లి ఫైనల్‌కు దూసుకెళ్లింది ఆసీస్. 2010లో భారత్‌పై, 2016లో ఇంగ్లండ్‌పై, 2018లో వెస్టిండీస్‌పై, 2020లో దక్షిణాఫ్రికాపై, 2023లో భారత్‌పై విజయంతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది కంగారూ టీమ్.
“There is a sense of loving to prove people wrong, while knowing that we have to prove ourselves over and over”
🗣️ Hayley Matthews with a statement ahead of the semi-finals vs Australia pic.twitter.com/wVYjPHwUgu
— Cricinfo (@cricinfo) June 30, 2026
ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా) : బేత్ మూనీ(వికెట్ కీపర్), జార్జియా వోల్, ఫొబే లిచ్‌ఫీల్డ్, ఎలీసా పెర్రీ, అషే గార్డ్నర్, జార్జియా వరేహం, అనాబెల్ సథర్లాండ్, నికోలా కారే, సోఫీ మొలినెక్స్(కెప్టెన్), లూసీ హామిల్టన్, కిత్ గార్త్.
వెస్టిండీస్ తుది జట్టు (అంచనా) : హేలీ మాథ్యూస్(కెప్టెన్), క్వియానా జోసెఫ్, డియాండ్ర డాటిన్, షెమైనె క్యాంప్‌బెల్(వికెట్ కీపర్), స్టెఫానీ టేలర్, జజర క్లాక్స్టన్, చినెల్లె హెన్రీ, జన్నిల్లీ గ్లాస్గో, అలియహ్ అల్లెనే, అఫీ ఫ్లెచర్, అష్మిని మునిసర్.