Rahul Ravindran | ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో నెగెటివిటీ మరియు ద్వేషపూరిత వాతావరణం హద్దులు దాటుతోంది. కొంతమంది నెటిజన్లు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, సెలెబ్రిటీలపై వ్యక్తిగత కక్ష సాధింపులకు దిగుతూ సైకో ఆనందాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, అసభ్యకరంగా మాట్లాడటం ఈ మధ్య మరీ ఎక్కువైంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ విషయంలో ఈ నెగెటివిటీ అత్యంత వికృతరూపాన్ని దాల్చింది. కేవలం సినిమాల గురించో, సమాజం గురించో వచ్చిన చర్చ కాస్తా చివరకు ఆయన చిన్న పిల్లలను చంపేస్తామనే ప్రాణ బెదిరింపుల స్థాయికి చేరుకుంది. ఈ దారుణమైన సైబర్ దాడితో తీవ్ర మనస్తాపానికి గురైన రాహుల్ రవీంద్రన్, ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన మొబైల్ నుండి కూడా ఈ యాప్‌ను డిలీట్ చేస్తున్నానని, ఇకపై ఇటువైపు చూడనని ఆయన స్పష్టం చేశారు.
అసలు ఈ వివాదానికి గల కారణాలను చూస్తే.. ఇటీవల పూణెలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ రాహుల్ రవీంద్రన్‌ను ట్యాగ్ చేస్తూ, సమాజంలో మహిళల సమస్యలపై సినిమాలు తీసినట్లే.. పురుషులపై జరుగుతున్న అన్యాయాలపైనా సినిమాలు తీస్తారా అని ప్రశ్నించాడు. దానికి రాహుల్ స్పందిస్తూ, మన సమాజంలో ఇప్పటికీ పితృస్వామ్య భావజాలం బలంగానే ఉందంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సమాధానం నచ్చని కొందరు నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శల దాడికి దిగారు. ఈ దాడి అంతటితో ఆగకుండా ఆయన భార్య, ప్రముఖ గాయని చిన్మయిపై కూడా వ్యక్తిగత దూషణలు చేయడం ప్రారంభించారు. ఒక సినిమా చర్చగా మొదలైన ఈ వ్యవహారం, చివరకు రాహుల్ పిల్లల ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ‘పిల్లలను చంపేస్తాం’ అంటూ ఒక నెటిజన్ చేసిన ఘోరమైన కామెంట్‌తో పరాకాష్టకు చేరింది.
ఆ బెదిరింపు కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి ఎక్స్‌లో షేర్ చేసిన రాహుల్, ఆ సమయంలో తాను అనుభవించిన నరకాన్ని, ఆవేదనను సుదీర్ఘ పోస్ట్‌లో పంచుకున్నారు. తాను బ్రెజిల్, జపాన్ దేశాల మధ్య జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షిస్తున్న సమయంలో, క్రీడా వార్తలకు సంబంధించిన అకౌంట్లను చూడటం కోసం ఎక్స్ యాప్‌ను ఓపెన్ చేశానని తెలిపారు. అయితే పొరపాటున నోటిఫికేషన్లు చూడటం, అందులో తన పిల్లల ప్రాణాలను తీస్తామనే కామెంట్‌ను చదవడంతో తన మానసిక స్థితి పూర్తిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు చదివాక తనలో చెప్పలేనంత కోపం, బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయని, ఆ కామెంట్ చేసిన వాడిని ఎలాగైనా వెతికి పట్టుకుని బుద్ధి చెప్పాలనే ఆలోచనలు తన మైండ్లోకి వచ్చాయని అంగీకరించారు. సాధారణంగా కోపం వస్తే తనను తాను శాంతింపజేసుకునే వాడినని, కానీ ఈసారి తన తల వేడెక్కిపోయి, చాలా సేపటి వరకు టీవీలో ఆటను కూడా చూడకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయానని వాపోయారు.
చాలా సమయం తర్వాత తన హృదయ స్పందన సాధారణ స్థితికి వచ్చిందని, అయితే ఆ ట్వీట్ చదివిన తర్వాత దాదాపు అరగంట పాటు తన ప్రవర్తన, తన ఆలోచనలు తనకే నచ్చలేదని రాహుల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా తాను ఈ విషయాలపై అతిగా స్పందిస్తున్నానేమో, లేదా ఇదంతా తన తప్పేమో, తన పిల్లలు ఈ ద్వేషాన్ని అనుభవించాల్సిందేమో అనే స్థాయికి తనను మానసిక వేదనకు గురిచేశారని పేర్కొన్నారు. క్రీడల సమాచారానికి ఎక్స్ యాప్ ఒక మంచి వేదిక కాబట్టే ఇన్నాళ్లూ నెగెటివిటీ ఉన్నా భరిస్తూ వచ్చానని, కానీ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, కుటుంబానికి హాని తలపెట్టేలా ఉన్న ఈ వాతావరణం తనకు ఇక చాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దేనినీ తన మనశ్శాంతిపై ఆధిపత్యం చెలాయించనివ్వనని, అందుకే తక్షణమే తన ఫోన్ నుండి ఈ యాప్‌ను తొలగిస్తున్నానని ప్రకటిస్తూ రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాకు స్వస్తి పలికారు. కాగా ఈ వివాదం ప్రస్తుతం పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.