హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): శాఖాపరమైన విచారణ పేరుతో 18 ఏండ్లుగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీ శైలజా రామయ్యర్పై కోర్టు ధికరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ నంద విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఓ ఉద్యోగికి రూ.4.48 లక్షల బకాయిలను చెల్లించాలని గత ఏడాది జూన్లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అమలు చేయలేదని తెలిపారు. శాప్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పెన్షన్ చెల్లించాల్సింది ప్రభుత్వమేనని, ప్రతివాదిగా ప్రభుత్వాన్ని చేర్చలేదని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.