ఖైరతాబాద్, జూలై 13: సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో శేఖర్ లాంటి కార్టూనిస్టుల అవసరం ఉన్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కార్టూనిస్టు శేఖర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఇస్తున్న శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ సభ ఆధివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు ఎస్ వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. కార్టూనిస్టులకు బొమ్మలు గీయడం ఒక్కటే తెలిస్తే సరిపోదని, సరైన రాజకీయ కామెంట్‌ను కూడా దానికి జోడించే నైపుణ్యం ఉండాలని పేర్కొన్నారు. ‘ఏ బ్రష్ అగైనెస్ట్ ప్రెజుడస్, ది ప్రొ పీపుల్ ఆర్ట్ ఆఫ్ శేఖర్’ అనే అంశంపై సీనియర్ జర్నలిస్టు, రచయిత కేవీ కూర్మనాథ్ స్మారకోపన్యాసం చేస్తూ ఇప్పుడున్న రాజకీయాలపై శేఖర్ కార్టూన్లు వేస్తే ఎప్పుడో అరెస్టు చేసే వారని వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మన్ తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ.. కార్టూనిస్టు శేఖర్ ఎక్కడ ఉంటే అక్కడ ఓ అర్థవంతమైన చర్చ ఉండేదని చెప్పారు. కార్టూనిస్టు శంకర్ మాట్లాడుతూ.. తనకు ముగ్గురు గురువులు ఉంటే అందులో మొదటి గురువు శేఖరే అని, ఆయనతో ఉంటే ఓ ఉద్యమాన్ని నడిపించినట్టు ఉంటుందని తెలిపారు. అనంతరం కార్టూనిస్టు శేఖర్ స్మారక అవార్డును ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కార్టూనిస్టు మృత్యుంజయ, చిత్రకారుడు శ్రీచిత్రకు అందజేశారు.
మహిళా సాధికారితను ఆచరించిన శేఖర్
దివంగత కార్టూనిస్టు శేఖర్ బొమ్మల్లో ఎక్కువ శాతం ప్రజా సమస్యలు, బాలికార్మిక వ్యవస్థతోపాటు మహిళా సాధికారిత కోసం వేసినవే ఉన్నాయని అవార్డు గ్రహీత మృత్యంజయ పేర్కొన్నారు. మహిళా సాధికారితను తన ఇంటి నుంచే ప్రారంభించారని, వ్యవసాయం మాత్రమే తెలిసిన ఆయన భార్య చంద్రకళకు అక్షరాలు రాయడం, చదవడం, కంప్యూటర్, డీటీపీ నేర్పించారని వివరించారు. శేఖర్ స్మారకార్థం ఇస్తున్న అవార్డును తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉన్నదని చెప్పారు.
ప్రజల కోసం పాటుపడే కార్టూనిస్టు
శేఖర్ బతికుండగా ఆయనకు ఒక బొమ్మ గీసి ఇవ్వలేకపోయానని, ఆయన చనిపోయిన వార్త తెలిశాక బాధతోనే ఒక బొమ్మ గీశానని శ్రీచిత్ర గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం పాటు పాడే కార్టూనిస్టుగా శేఖర్ ఎంతో ఎత్తుకు ఎదిగారని, ఆయన గుర్తుగా అవార్డు తీసుకోవడం జీవితంలో మరచిపోలేని విషయమని చెప్పారు.