హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల అనుసంధాన (జీసీఆర్ఎల్) ప్రాజెక్టుపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలతో ఆరోసారి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఇప్పటికే అన్ని రాష్ర్టాలకు సమాచారమిచ్చింది. జీసీఆర్ఎల్ ప్రాజెక్టును ఎక్కడి నుంచి చేపట్టాలనే అంశంపై సుదీర్ఘకాలంగా చర్చ కొనసాగుతున్నది. తొలుత సమ్మక్కసాగర్ నుంచి, ఆ తర్వాత ఇచ్చంపల్లి నుంచి నీటిని మళ్లించాలని ప్రతిపాదించారు.
గోదావరి జలాలను ప్రధానంగా ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఏ మార్గంలో తరలించాలి? లింక్ ప్రాజెక్టులో రాష్ర్టాల నీటి వాటాలు, బ్యాక్‌వాటర్ స్టడీ తదితర సాంకేతిక అంశాలపై బేసిన్‌లోని రాష్ర్టాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆ అంశాలపై బేసిన్‌లోని తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి తదితర రాష్ర్టాలతో ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే ఐదుసార్లు సంప్రదింపుల సమావేశాలను ఏర్పాటు చేసింది.
వాటిలో ఐదో సమావేశాన్ని హైదరాబాద్‌లోనే నిర్వహించింది. అయినప్పటికీ రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ ప్రాజెక్టు వాటర్ ఇన్‌టేక్ పాయింట్‌పై తెలంగాణ సైతం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇచ్చంపల్లి నుంచి నీటిని తీసుకెళ్లాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. సమ్మక్కసాగర్ నుంచే లింక్ ప్రాజెక్టును చేపట్టాలని పట్టుబట్టింది. కానీ, తాజాగా తెలంగాణ తన వైఖరిని మార్చుకుని, ఇచ్చంపల్లి నుంచి నీటిని తీసుకెళ్లేందుకు సైతం సుముఖత వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం 6వ కన్సల్టేషన్ సమావేశాన్ని జలసౌధ నుంచి నిర్వహించనున్నారు.