హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కులగణనతోనే ఓబీసీల జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. మైసూరులో ఓబీసీ నారాయణగురు భవన నిర్మాణ పనులకు కర్ణాటక శాసనమండలి నేత బీకే హరిప్రసాద్, ఎమ్మెల్యే చికమాడు అనిల్‌తో కలిసి ఆయన గురువారం భూమి పూజ చేశారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. ‘మేమెంతో మాకంత’ అన్న డిమాండ్‌కు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు.
ఈ మేరకు రాజ్యాంగంలో ఉందని పేర్కొన్నారు. కానీ, ఎవరి జ నాభా ఎంతనేది కేంద్రం ఇప్పటివరకు బహిర్గతం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు తెలిస్తే ఎవరి వాటా వారు అడుగుతారని, అందుకే జనగణనలో కులగణన చేయటం లేదని దుయ్యబట్టారు. స్వా తంత్య్రం వచ్చి ఇన్నేండ్లు అవుతున్నా.. ఓబీసీల బతుకులెలా ఉన్నాయో తెలుసుకునేందుకు కులగణన చేయలేదంటేనే అర్థం చేసుకోవాలని మండిపడ్డారు. ఇది కుట్రా? కాదా? అని ప్రశ్నించారు. రానున్న జ నగణనలో కులగణన చేయాలని డి మాండ్ చేశారు.
దేశంలోని అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయని, నోటి మాటతో జపం చేయకుండా, రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి చేయాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఓబీసీ బిల్లులను అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపినప్పుడు, వాటిని చట్టం చేయాల్సిన బాధ్యత బీజేపీదేనని పేర్కొన్నారు. బీజేపీకి మెజారిటీ ఉండటం వల్ల ఆ పార్టీకి అనుకూలమైన తీర్మానాలు, రాజ్యాంగ సవరణలు, సంస్కరణలు జరుగుతున్నాయని తెలిపారు. కానీ, ఓబీసీల అంశం వచ్చేటప్పుడు మాత్రం బీజేపీ పాలకులు సాకులు చెప్పి దాటవేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల్లో అన్ని రాష్ట్రాల్లో వెంటనే 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీలు ఉద్యమం చేపట్టకముందే న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విక్యాతానందస్వామి, ఓబీసీ నాయకులు గురురాజు, ఓబీసీ కర్ణాటక సెక్రటరీ గోపి, ధృవరాజ్, బాల్‌రాజు గుత్తేదార్, మురళీ తదితరులు పాల్గొన్నారు.