హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): అన్నారం బరాజ్‌లో తలెత్తిన సీపేజీ సమస్యను పూర్తిగా అరికట్టామని, ఎన్డీఎస్ఏ సూచనల మేరకు గ్రౌటింగ్ చేశామని నిర్మాణ ఏజెన్సీ ఆప్కాన్స్ వెల్లడించింది. ఈ మేరకు కాళేశ్వరం కమిషన్ ఎదుట నివేదించింది. కాళేశ్వరం కమిషన్ నిర్వహిస్తున్న బహిరంగ విచారణ శనివారం సైతం కొనసాగింది. అందులో భాగంగా అన్నారం బరాజ్ నిర్మాణ సంస్థ ఆఫాన్స్ ఇన్ఫ్రా లిమిటెడ్ హైడ్రో బిజినెస్ యూనిట్ హెడ్ నాగమల్లికార్జునరావు, జీఎం శేఖర్దాస్లను జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. అన్నారం బరాజ్ నిర్మాణం, తలెత్తిన సాంకేతిక సమస్యలు, చేపట్టిన నివారణ చర్యలు తదితర అంశాలపై ఆరా తీశారు. బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం పెంపు, మేడిగడ్డ బరాజ్ నుంచి అన్నారం వరకు నీటిని తరలించే కాలువ పొడవును తగ్గించే చర్యల్లో భాగంగా తొలుత ఎంపిక చేసిన స్థలానికి 2.2 కిలోమీటర్ల దిగువన బరాజ్‌ను నిర్మించామని వివరించారు.
వరద ప్రవాహ వేగానికి సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయని, అందుకు గల కారణాలపై పుణెకి చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో పనిచేసిన రిటైర్డ్ ఇంజినీర్ పీబీ దేవలలికర్, ఎన్హెచ్పీఎస్కు చెందిన ఎస్సీ మిట్టల్, ఇన్ఫ్రా ప్లాన్ అనే సంస్థకు చెందిన ఓ నిపుణుడిని కన్సల్టెంట్లుగా నియమించుకుని కేస్ స్టడీస్ చేయించామని, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ మెంబర్ రామరాజు, ఈఎన్సీ మురళీధర్‌లు టీజీఈఆర్ఎల్తోనూ మోడల్ స్టడీస్ చేయించారని వెల్లడించారు. బరాజ్ దిగువన సరిపోనూ టెయిల్ వాటర్ లేకపోవడం, ఎనర్జీ డిసిపేషన్ ప్రొటెక్షన్ వర్స్ సరిగ్గా లేకపోవడంతోనే సీసీ బ్లాకులు డ్యామేజ్ అయినట్టు వారు తేల్చారని పేర్కొన్నారు. అదనంగా మరో స్టిల్లింగ్ బేసిన్‌ను, రాఫ్ట్‌కు 60 మీటర్ల దూరంలో మరో రాఫ్ట్‌ను, సీసీ బ్లాక్స్‌కు ముందట మరో ఆప్రాన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారని తెలిపారు. 2022లో తొలిసారి బరాజ్‌లో సీపేజీని గుర్తించామని, ప్రభుత్వ అనుమతి తీసుకుని ఢిల్లీ నుంచి నిపుణులను పిలిపించి గ్రౌటింగ్ చేసి, ఆ సమస్యను పరిషరించామని వివరించారు.
ప్రస్తుతం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సిఫారసుల మేరకు బరాజ్‌కు టెస్టులు చేశామని, ఆ నివేదికలనూ సమర్పించామని తెలిపారు. ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు సీసీ బ్లాకులను పునరుద్ధరించామని, జియోఫిజికల్ టెస్టులు నిర్వహించామని, ఇసుక మేటలను తొలగించామని కమిషన్‌కు నివేదించారు. బరాజ్‌లో క్రాక్స్ ఏమైనా వచ్చాయో, లేదో చెక్ చేసేందుకు డ్రోన్ సర్వే చేశామని, ఎక్కడా ఒక క్రాక్ కూడా బరాజ్‌కు పడలేదని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉండగా 3 బరాజ్‌లకు సంబంధించి ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులందరి విచారణ శనివారంతో పూర్తయిందని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. సోమవారం నుంచి కమిషన్‌కు వ్యక్తిగతంగా అఫిడవిట్లను దాఖలు చేసినవారిని విచారించనున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా ఎలక్ట్రిసిటీ ఇంజినీర్ రఘు, రిటైర్డ్ ఇంజినీర్ దొంతుల లక్ష్మీనారాయణను సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు సమాచారం.
ఇరిగేషన్లో ప్రమోషన్ల కోసం డీపీసీ
రాష్ట్ర నీటిపారుదల శాఖలో ప్రమోషన్లకు సంబంధించి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా తొలుత డీఈఈ ప్రమోషన్లకు అర్హులైన ఏఈఈల సీనియారిటీ జాబితాను పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈఈ, ఎస్ఈ నుంచి సీఈ, ఆపై ఈఎన్సీ వరకు క్యాడర్లకు సంబంధించి ప్రమోషన్లను కూడా కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. మరోవైపు ప్రస్తుతం కూడా గతంలో మాదిరిగానే అడ్హాక్ ప్రమోషన్లను కల్పించనున్నారు. ఇప్పటివరకు రెగ్యులర్ ప్రమోషన్లను కల్పిస్తారని భావించినా ఆ ఆశలు అడియాశలయ్యాయని ఇంజినీర్లు వాపోతున్నారు.