హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, ఐటీఅండ్‌సీ, పీటీవో పోస్టుల కానిస్టేబుళ్లకు 21న పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్, డీజీ అభిలాష బిస్త్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 9 నెలల పాటు 8,047 మంది కానిస్టేబుళ్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. వారిలో 2,338 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండగా.. 5,709 మంది పురుషులు ఉన్నారని తెలిపారు. ఈసారి తల్లులైన మహిళా ట్రైనీల కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్‌ను నియమించినట్టు వెల్లడించారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్లలో డిగ్రీ పూర్తి చేసినవారు 5,470, పీజీ చేసినవారు 1,361, టెక్నికల్ బ్యాగ్రౌండ్ ఉన్నవారు 1,755, నాన్ టెక్నికల్ విభాగం నుంచి 5,505, ఎల్ఎల్బీ చేసిన వారు 15 మంది ఉన్నట్టు వివరించారు.