హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీజీఎల్పీఆర్బీ) నిర్వహించిన 2022 పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలో నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 59 మంది అభ్యర్థులపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో క్రిమినల్ కేసు నమోదైంది. వీరిలో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగాలకు చెందిన 54 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు, ముగ్గురు ఫైర్‌మన్, ఇద్దరు వార్డర్లు కలిసి 59 మంది అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉమాకాంత్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే.. 2022 ఏప్రిల్ 25న కానిస్టేబుల్, ఫైర్‌మన్, వార్డర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ధ్రువపత్రాల పరిశీలన సందర్భంగా తాతాలికంగా ఎంపికైన 59 మంది అభ్యర్థులు సమర్పించిన బోనఫైడ్ సర్టిఫికెట్లు నకిలీవని బోర్డు గుర్తించింది. గతంలోనే వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, వారిచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని ఫిర్యాదులో పేరొన్నారు. దీంతో పోలీసు ఉద్యోగాల నియాకమండలి 59 మంది ఎంపికను రద్దు చేస్తూ మే 1, 2025న హైదరాబాద్ పోలీసులకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని మెమో ద్వారా సూచించింది. బోర్డు ఆదేశాల మేరకు సీసీఎస్‌లో ఐపీసీ సెక్షన్లు 420, 468, 471, 120-బి కింద 59 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును సీసీఎస్‌లోని సిట్ బృందానికి అప్పగించారు.
అనూహ్యంగా నకిలీ సర్టిఫికెట్ల కేసు బయటికి రావడంతో పోలీసు ఉన్నతాధికారుల తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియల విశ్వసనీయతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చట్టపరమైన చర్యలతోపాటు నియామక ప్రక్రియలో లోపాలను సవరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.