Indiramma Indlu | రాయపర్తి, జనవరి 27: ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం కాంగ్రెస్ కార్యకర్త ఏకంగా గ్రామ కార్యదర్శిని బెదిరించాడు. తనకు ఇల్లు రాకపోతే అవసరమైతే ఎకరం పొలం అమ్మి అయినా సరే చంపుతానంటూ ఫోన్‌చేసి భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై కొంగ శ్రవణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయపర్తి మండలం వాంకుడోతు తండా గ్రామ పంచాయతీలో ఈనెల 24న పంచాయతీరాజ్ ఏఈ తాళ్ల శ్రీప్రియ సారథ్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల జాబితాను పంచాయతీ కార్యదర్శి కీర్తి అభిలాష్ చదివి వినిపించారు. ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త వాంకుడోతు రవీందర్ ఈనెల 25న పంచాయతీ కార్యదర్శికి ఫోన్‌చేసి, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు ఎందుకు లేదని ప్రశ్నించాడు. ‘నాకున్న వ్యవసాయ భూమిలో ఎకరం అమ్మి అయినా సరే నిన్ను చంపి తీరుతా’ అంటూ బెదిరించాడు. బాధితుడు అభిలాష్ గ్రామ పంచాయతీ కార్యదర్శులందరితో కలిసి ఈనెల 26న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.