జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత అందె సత్యనారాయణ ఆత్మహత్యకు యత్నించాడు. పార్టీలో కొత్తవారికి అధిక ప్రాధాన్యతనిస్తూ పాతవారిని అవమానపరుస్తున్నారని మానసికంగా కుంగిపోయిన సత్యనారాయణ పురుగుల మందు తాగాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు వీడియో తీసి వైరల్ చేశాడు. ఆ వీడియోలో సత్యనారాయణ ఆవేదన ఇలా.. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హయాం నుంచి 30 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నా. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
చల్లా జక్కిరెడ్డి పార్టీ గెలిచాక కాంగ్రెస్‌లోకి వస్తే అతనికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి? సీనియర్ నేతలను పక్కన పెట్టి అతని ఇంటికి వెళ్లడం ఏంటి? ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వవద్దని, వారి ఇండ్లకు వెళ్లవద్దని మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పినా పట్టించుకోలేదు’ అని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. గుంట నక్కలు పార్టీ గెలిచాక వస్తూనే ఉంటారని, శ్రీధర్ బాబు చూసుకోవాలని అన్నాడు. సీనియర్ నేతలు ప్రభాకర్, రాజబాబు, గంట దేవేందర్, తిరుపతి ఇలా అనేక మంది చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే మంత్రి కారులో కూర్చోవడం, వారికి మాత్రమే పనులు చేస్తుంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకులు బాధపడాల్సి వస్తుందని పేర్కొన్నాడు. తన చావుతోనైనా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సత్యనారాయణను కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు.