మిర్యాలగూడ, ఆగస్టు 18: పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని శనివారం రాత్రి నిప్పంటించుకున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని హైదలాపురం ఇందిరమ్మ కాలనీకి చెందిన భగవాన్ 4ఏండ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నాడు. కాలనీలో ఆదివారం గుడి పండుగ ఉండగా.. ఫ్లెక్సీలో తన ఫొటో లేదని మనస్తాపం చెందాడు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారని, తనకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదనతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
స్థానికులు, కుటుంబ సభ్యులు మంటలను ఆర్పి మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. భగవాన్ ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడని, అతడి కుటుంబాన్ని కాంగ్రెస్ ఆదుకోవాలని ఆటో యూనియన్ నాయకులు కోరారు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భగవాన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.